కేవలం ముస్లింల కోసమే బీఆర్ఎస్ (BRS) సర్కార్ పని చేస్తోందని యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ (Yogi Adityanath) మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పాటైన తెలంగాణ ఇప్పుడు అప్పుల్లో కూరుకు పోయిందని ఆరోపించారు. పరీక్షలను కూడా సరిగ్గా నిర్వహించలేని వ్యక్తి ప్రభుత్వాన్ని ఏం నడిపిస్తారంటూ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు.
కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో బీజేపీ రామరాజ్య స్దాపన సంకల్ప సభను నిర్వహించారు. ఈ సభలో జై శ్రీరాం… జై తెలంగాణ నినాదాలతో యోగీ ఆదిత్య నాథ్ ప్రసంగాన్ని ప్రారంభించారు. మొదట సోదరీ సోదరీమణుల్లారా… మీకు నా నమష్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. మీతో మాట్లాటం చాలా ఆనందంగా ఉందని ప్రజలను ఉద్దేశించి అన్నారు.
ఎంఐఎం, బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ కామన్ ఫ్రెండ్ అని ఆరోపించారు. కాంగ్రెస్ ఉంటే ఫ్రీగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేవారా, ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసేవారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే అయోధ్యలో రామమందిరాన్ని కట్టే వారా? అని అడిగారు. మోడీ నేతృత్వంలో నడుస్తున్న భారత ప్రభుత్వంపై ఏ దేశం కూడా కన్నెత్తి చూడలేదన్నారు.ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందన్నారు.
అక్కడ అభివృద్ధి అద్భుతంగా ఉందని వెల్లడించారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వాళ్లు ప్రభుత్వం ఏం నడుపుతారు? అంటూ ప్రశ్నించారు. .బీఅర్ఎస్, బీఎస్పీలు దోస్తులేనన్నారు. ఓట్లను చీల్చేందుకు బీఎస్పీ రంగంలోకి దిగిందన్నారు. బీజేపీనీ గెలిపిద్దాం…బంగారు తెలంగాణ సాధిస్తాం అంటూ తెలుగులో యోగీ తెలిపారు.