రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పెరుగుతూ పోతున్న అప్పులు ఇప్పుడు పతాకస్థాయికి చేరుకొన్నాయి. ముఖ్యంగా 2019లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే ఉన్న రాష్ట్ర అప్పులు హైస్పీడ్ లో పెరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఇవి బడ్డెట్ లో చూపిస్తున్నఅప్పులు మాత్రమే. ఇవి కాకుండా కార్పొరేషన్ల రుణాలు, ఇతరత్రా తీసుకొంటున్న అప్పులు వీటికి అదనంగా ఉన్నాయి. ఇంతకీ ఏపీకి ఉన్న అప్పులు ఎంత అని ఆలోచిస్తున్నారా..?
ఏపీ అప్పులకి బ్యాంకులు సైతం బెంబేలెత్తిపోతున్నాయని చర్చ జరుగుతోంది. ఇంత అప్పు ఉన్నా జగన్ సర్కార్ మాత్రం రవ్వంతైనా ఆందోళన చెందడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ అప్పు అక్షరాలా 10 లక్షల 11 వేల 827 కోట్ల రూపాయలు అని ప్రచారం జరుగుతోంది. అవును, తాజా లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం రుణాలు, చెల్లింపుల భారాలు కలిపి మొత్తం అప్పు 10 లక్షల 11 వేల కోట్లకు చేరిందని వార్తలు వస్తున్నాయి.
ఇందులో గుత్తేదారులకు, సరఫరాదారులకు చెల్లించాల్సిన బకాయిలు మరో లక్షా 70 వేల కోట్ల రూపాయలు ఉండొచ్చని అనధికారిక అంచనా. ఆ పెండింగు బిల్లులూ ఓ రకంగా అప్పుల్లాంటివే. కేంద్ర ప్రభుత్వం బహుపరాక్ అని హెచ్చరిస్తున్నా, శ్రీలంకను చూసి నేర్చుకోండని సాక్షాత్తూ కేంద్ర మంత్రి ఢిల్లీలో సమావేశం నిర్వహించి బోధ చేసినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం లెక్కచేయడం లేదనే వాదన వినిపిస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ అప్పులపై ఆర్థిక నిపుణులు, సంస్థలు విస్తుపోవాల్సిన పరిస్థితులున్నాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొంటున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని, చట్టానికి విరుద్ధమని సాక్షాత్తూ కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. ఐనా ఎక్కడ దొరికితే అక్కడ ఎవరు ఏది కావాలంటే దాన్ని తాకట్టుపెడుతూ మోయలేని భారాన్ని ప్రజలపై ఏపీ ప్రభుత్వం రుద్దుతుందనే విమర్శలు వస్తున్నాయి.
అప్పులపై అవాస్తవాలు.. ప్రభుత్వ స్పందన
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పుల భారం రూ.6,26,527.05 కోట్లేనని ప్రభుత్వ ఆర్థిక సలహాదారు దువ్వూరి కృష్ణ ప్రకటించారు. జగన్ హయాంలోనే మొత్తం అప్పులు చేశారన్నట్లు ప్రచారం జరుగుతోందని.. అసలు రూ.10.11 లక్షల కోట్ల అప్పుల లెక్క ఎక్కడినుంచి వచ్చిందో తమకు అర్థం కావడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎంత రుణం ఉందో గణాంకాలు వెల్లడించారు. ప్రభుత్వం ఏదీ ఊహాజనితంగా చెప్పదని, ఒక ఖర్చు చేసిందంటే ఎప్పటికప్పుడు లెక్కల్లో నమోదవుతుందని అన్నారు. కేంద్రప్రభుత్వం, ఆర్బీఐ, ఇతర సంస్థలు ఆంధ్రప్రదేశ్ అప్పులను తప్పుపట్టినట్లు ప్రచారం చేస్తున్నారని.. అలా తప్పు పడితే ఈ అప్పులు చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు దువ్వూరి కృష్ణ.