సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ(AP)లో నేతలు ప్రచార పర్వంలో బీజీగా మారారు. అధికార వైసీపీ, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమితో పాటు కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. వైసీపీలో టికెట్ దక్కని పలువురు ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి వెళ్లగా ఆ పార్టీలో టెన్షన్ మొదలైంది. టీడీపీ కూటమిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో కలియతిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు.
మరోవైపు వైఎస్ వారసురాలిగా ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు ఆయన సతీమణి వైఎస్ భారతి(YS Bharathi) ఎన్నికల ప్రచారం చేయడానికి సద్ధమయ్యారు.
సీఎం వైఎస్ జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానం బాధ్యతలను వైఎస్ భారతికి అప్పగించారు. గురువారం నుంచి వారం రోజుల పాటు ఆమె పులివెందులలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. సీఎం జగన్ ఇప్పటికే అన్ని నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ వెళ్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లోనూ పులివెందులలో ఎన్నికల ప్రచార బాధ్యతలను భారతి చేపట్టారు.
పులివెందులతోపాటు కడప పార్లమెంట్ పరిధిలోనూ పలు నియోజకవర్గాలలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ తో కలిసి గురువారం పులివెందులకు చేరుకున్నారు. సీఎస్ఐ చర్చ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముగిసిన తర్వాత ఉదయం పులివెందుల అభ్యర్థిగా జగన్ నామినేషన్ దాఖలు చేశారు.