ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి (AP CM YS Jaganmohan Reddy) సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో జగన్‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. జగన్‌తో పాటు సీబీఐకి (CBI) కూడా ఉన్నతన్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.
జగన్ కేసులకు సంబంధించి దాఖలైన పిటీషన్‌పై ఈరోజు (శుక్రవారం) సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఇందులో భాగంగా జగన్ అక్రమాస్తుల కేసులో విపరీతమైన జాప్యం ఎందుకు జరగుతుందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఈ మేరకు తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది సుప్రీం. ఈ కేసులో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలని ఎంపీ రఘురామ సుప్రీంలో పిటీషన్ వేశారు. జగన్ కేసులపై సుప్రీంలో ఎంపీ పిటీషన్ దాఖలు చేశారు. తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విపరీతమైన జాప్యం జరుగుతోందని 3071 సార్లు జగన్ కేసును సీబీఐ కోర్టు వాయిదా వేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
జగన్ ప్రత్యక్ష హాజరుకు కూడా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు. వందల కొద్ది డిశ్చార్జి పిటీషన్లు వేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే రఘురామ పిటిషన్‌పై సుప్రీం పలు ప్రశ్నలు సంధించింది. జగన్ అక్రమాస్తుల కేసుకు ఎంపీ రఘురామకు ఏమిటి సంబంధమని కోర్టు ప్రశ్నించారు. ఎంపీ రఘురామ ఫిర్యాదుదారు కాదని.. బాధితుడు కూడా కానప్పుడు ఆయనెందుకు పిటీషన్ వేశారని సుప్రీం ధర్మాసనం అడిగింది. ఎంపీ రఘురామ కూడా వైసీపీ ఎంపీనే అని ఎంపీ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.