– మణిపూర్ తగలబడుతుంటే బీజేపీ మద్దతిస్తారా?
– క్రైస్తవుల్ని చంపేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?
– జగన్ పై షర్మిల నిప్పులు
– ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతల స్వీకరణ
– టీడీపీ, వైసీపీ ఒక్కటేనంటూ విమర్శ
బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని.. మతాల మధ్య అగ్గి పెట్టి చలి కాచుకుంటుందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. రాష్ట్రం నుంచి 22 మంది వైసీపీ, ముగ్గురు టీడీపీ ఎంపీలు.. మరో ఆరుగురు రాజ్యసభ ఎంపీలున్నా ప్రత్యేక హోదా సాధించకపోగా బీజేపీకి అనుకూలంగా మారారని మండిపడ్డారు. మొత్తంగా రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయన్నారు.
మణిపూర్ లో క్రైస్తవులపై దాడులు చేస్తూ.. చర్చిలను ధ్వంసం చేస్తుంటే.. జగన్ రెడ్డి క్రైస్తవుడు అయి ఉండీ మాట్లాడకపోవడం దారుణమన్నారు షర్మిల. మనుషులు చచ్చిపోతున్నా కూడా బీజేపీకి మద్దతివ్వడం ఏంటని ప్రశ్నించారు. అంతకుముందు షర్మిల కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. వారి తీరుపై ఆమె మండిపడ్డారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో ఆమె గన్నవరం విమానాశ్రయానికి రాగా.. అక్కడి నుంచి కాన్వాయ్ లో ఏపీ కాంగ్రెస్ కార్యాలయానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే ఎనికేపాడు వద్ద వాహనాలను పోలీసులు మళ్లించారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ నేతలు రోడ్డుమీద బైఠాయించారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని చూసి ప్రభుత్వం భయపడుతోందన్నారు. అందుకే, తన కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. తమ కార్యకర్తల్ని అడ్డుకుంటే ఊరుకోమని హెచ్చరించారు. అవసరమైతే జైలుకైనా వెళ్తామని షర్మిల తేల్చిచెప్పారు. ఏపీ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. తమ కాన్వాయ్ కు అనుమతి ఇవ్వకపోతే మొత్తం విజయవాడ మొత్తాన్ని బంద్ చేస్తామని హెచ్చరించారు.