ఏపీ(AP) రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి చక్రం తప్పిన వైఎస్ఆర్ కుటుంబం ఇప్పుడు చీలింది. వైఎస్సార్ రక్తం పంచుకుని పుట్టిన అన్నా చెల్లెళ్లు ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శ, ప్రతివిమర్శలతో దూసుకెళ్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారు.
తాజాగా ఆమె వైఎస్ జగన్(YS Jagan)పై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అయిన తర్వాత జగన్ మారిపోయాడని షర్మిల అన్నారు. కాకినాడ జిల్లాల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చిందంటూ బుధవారం సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.
రాజశేఖర్ రెడ్డి కుటుంబం చీలడానికి జగనే ప్రధాన కారణమన్నారు. ఆయనే చేతులారా చేసుకున్నారని చెప్పారు. జగన్ కోసం 3200 కిలో మీటర్లు తాను పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. స్వలాభం చూసుకోకుండా ఏది అడిగితే అది జగన్ కోసమే చేశానన్నారు. ఏపీని జగన్ బీజేపీకి బానిసగా చేశాడని షర్మిల మండిపడ్డారు. అయితే, వైఎస్ వారసులు అని చెప్పుకుంటే సరిపోదని, ప్రజలకు పనులు చేయాలని షర్మిల విమర్శించారు.
రాజధాని, పోలవరం ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. తన కుటుంబం చీలిపోతుందని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరానని.. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారని తెలిసి కూడా పార్టీలో చురినట్లు పేర్కొన్నారు. మరోవైపు పోలవరం వైఎస్ కలల ప్రాజెక్ట్ అని షర్మిల అన్నారు. రాజశేఖర్ రెడ్డి వెళ్లిపోయిన తర్వాత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పోలవరాన్ని పట్టించుకోలేదన్నారు.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్.. సీఎం అయిన తర్వాత పోలవరంను 2021లో పూర్తి చేస్తానని చెప్పినా ఇప్పుడు ఆ ఊసేలేదని అన్నారు. జగన్ బీజేపీకి బానిసగా మారి స్టీల్ ప్లాంట్ పణంగా పెట్టారని తెలిపారు. అసలు రాజధాని ఉందా? లేదా? అని ప్రజలకి అర్థం కావడం లేదన్నారు. జగన్ కోసం రాజీనామా చేసిన 18 మందిలో ఎంత మంది మంత్రులు అయ్యారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.