సామాజిక మాధ్యమాల్లో తన ప్రతిష్ఠను దిగజార్చేలా కొందరు పోస్టులు పెడుతున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరపూరిత దురుద్దేశంతో తనను భయభ్రాంతులకు గురిచేసేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
కొన్ని యూట్యూబ్ ఛానెళ్లతో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో నిరాధారపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. మహిళ ప్రతిష్ఠను దిగజార్చేలా ఈ పోస్టులు ఉంటున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ(APCC) అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రజల్ని కలుస్తూ ప్రచారం ప్రారంభించానని, అయితే కొందరు నేరపూరిత ఉద్దేశంతో తనపై, తన సహచరులపైనా అభస్య కామెంట్లు పెడుతున్నారని వాపోయారు.
తమను ఇబ్బంది కలిగిస్తూ అవమానించేలా వీడియోలు చేస్తున్నారని వివరించారు. తన అన్నతో విభేదించి వైఎస్ఆర్, వైఎస్ జగన్కు ఆజన్మ శత్రువులైన చంద్రబాబుతో చేతులు కలిపానంటూ ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. షర్మిల ఫిర్యాదు మేరకు రెండు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తన కుటుంబ ప్రతిష్ఠ ప్రమాదంలో పడిపోయిందని, వారిపై చర్యలు తీసుకోకపోతే తమకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని అన్నారు. రమేశ్ బులగాకుల, మేదరమెట్ల కిరణ్కుమార్, ఆదిత్య(ఆస్ట్రేలియా), పంచ్ ప్రభాకర్(అమెరికా), సేనాని, సత్యకుమార్ దాసరి(చెన్నై), వర్రా రవీందర్రెడ్డి, మహ్మద్ రెహ్మత్ పాషా, శ్రీరెడ్డి తదితర వ్యక్తులు సోషల్ మీడియా నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల ఫిర్యాదులో పేర్కొన్నారు.