కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ (sonia gandhi) తో వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ (ys sharmila) షర్మిల గురువారంనాడు ఢిల్లీలో భేటీ అయ్యారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే విషయమై చర్చించేందుకు ఈ భేటీ జరిగిందని ప్రచారం సాగుతుంది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని షర్మిల భావిస్తున్నారని గత కొంత కాలంగా ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ (dk sivakumar) తో కూడా ఆమె పలుసార్లు సమావేశమయ్యారు.
భర్త అనిల్ తో కలిసి షర్మిల ఢిల్లీ వెళ్లారు. గురువారం సోనియా గాంధీతో భేటీ అయ్యారు. షర్మిల న్యూఢిల్లీ పర్యటన వ్యక్తిగతమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వైఎస్ఆర్టీపీ(ysrtp)ని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయమై కాంగ్రెస్ (congress) అగ్రనేతలతో చర్చించేందుకు వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లినట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా షర్మిల, ఆమె భర్త అనిల్ సోనియాగాంధీతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే వైఎస్ షర్మిల సేవలను తెలంగాణలో ఉపయోగించుకుంటారా, ఏపీలో వినియోగించుకుంటారా అనే విషయమై చర్చ కూడ లేకపోలేదు. షర్మిల తెలంగాణలో ప్రచారం చేస్తే రాజకీయంగా బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకొనే అవకాశం ఉందని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
ఇదే విషయాన్ని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పారు. అయితే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం షర్మిల తెలంగాణలో పార్టీ కోసం పనిచేస్తే నష్టం లేదని ప్రకటించారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ కోసం పనిచేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన అయిష్టతను వ్యక్తం చేశారు. మీడియా సమావేశాల్లోనే ఆయన ఈ విషయాన్ని పలుమార్లు ప్రకటించారు.