ప్రజలకి న్యాయం జరగాలనే ఏపీ రాజకీయాల్లో(AP Politics)కి వచ్చానని ఏపీసీసీ చీఫ్ షర్మిల(YS Sharmila) అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. యువత కోసమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఏపీ రాజకీయాల్లోకి వచ్చిందని గుర్తుంచుకోవాలని సూచించారు.
వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీకి అనుకూలంగా మారాయని విమర్శించారు. తనకు ఏపీ పుట్టినిల్లు అయితే తెలంగాణ మెట్టినిల్లు అని షర్మిల చెప్పుకొచ్చారు. వైసీపీకి తన రక్తం ధారపోశానని.. ఇప్పుడు ఆ పార్టీ తనపై ముప్పేట దాడి చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నారు.
జగన్ జైలులో ఉన్నప్పుడు ఆ పార్టీని తన భుజస్కంధాలపై మోశానని గుర్తు చేశారు. వైఎస్ఆర్ బిడ్డ ఎవరికీ భయపడదని.. తాను యుద్ధానికి సిద్ధమని.. మీరు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. వైఎస్ఆర్ పాలనకి.. జగన్ పాలనకీ.. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. వైఎస్ఆర్ సీపీలో వై అంటే వైవీ సుబ్బారెడ్డి.. ఎస్ అంటే సాయిరెడ్డి.. ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని వ్యాఖ్యానించారు.
ఓట్ల కోసం జాబ్ నోటిఫికేషన్ ఇస్తున్నారని, ఇన్నేళ్లలో ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? అని ప్రశ్నించారు షర్మిల. అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తామని గత ఎన్నికలో వాగ్దానం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని అన్నారు. 70 వేల కోట్ల విలువైన గంగవరం పోర్టు 600 కోట్లకి అమ్మేశారని, మళ్ళీ ప్రభుత్వం చేతికి ఆ పోర్టు రాదని ఆరోపించారు.
ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంగా మారాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు షర్మిల. ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా ఏపీ బీజేపీ వశం అయిపోయిందని, జగన్ బీజేపీకి బానిసగా మారారని విమర్శించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చమత్కరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా పైనే ఉంటుందని స్పష్టం చేశారు షర్మిల.