తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) సిద్ధమయ్యారు. నిన్నటి వరకు వైఎస్సార్‌టీపీ (YSRTP) ని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే వార్తలకు నేటితో చెక్ పెట్టినట్టే.. కాగా కాంగ్రెస్‌తో కలిసి అవినీతి ప్రభుత్వం పై పోరాటం చేద్దామని భావించాం. అందుకే కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం. 4 నెలలు ఎదురు చూశామని షర్మిల అన్నారు.. కానీ కాంగ్రెస్‌తో అవగాహన కుదరకపోవడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly election) ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకొన్నట్టు తెలిపారు.
ఖమ్మం జిల్లా (Khammam District) పాలేరు (Paleru) నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని నిర్ణయించుకున్న షర్మిల హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించేందుకు సిద్దమయ్యారు. పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మరోవైపు తాను రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నట్టు నేతలకు షర్మిల తెలిపారు. అయితే పార్టీ శ్రేణులు, అభిమానులు తన భర్త అనిల్ కుమార్, తల్లి విజయలక్ష్మి కూడా పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారని, అవసరమైతే తన తల్లి, బ్రదర్ అనిల్ పోటీ చేస్తారని చెప్పారు. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో పై దృష్టి పెట్టిన షర్మిల ఎన్నికలు సమీపిస్తుండటంతో దూకుడు పెంచారు..