తప్పుచేస్తే చంద్రబాబు తననే వదిలిపెట్టరని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) అన్నారు. రాజోలు(Rajolu) నియోజకవర్గం పొదలాడ(Podalada)లో సోమవారం 210వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్(CM Jagan)పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుల అవినీతిని భయటపెట్టినందుకు సీఎం జగన్ పాదయాత్ర మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే అడ్డుకోవడానికి స్కెచ్లు వేశారని ఆరోపించారు.
సాగనిస్తే పాదయాత్ర… అడ్డుకుంటే దండయాత్ర అని లోకేశ్ హెచ్చరించారు. యువగళం పాదయాత్రకు 79 రోజులు బ్రేక్ ఇచ్చినందుకు క్షమించాలన్నారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి కష్టాలు తీరుస్తానని భరోసా ఇచ్చారు. ప్రతీ వంద కిలోమీటర్ల పాదయాత్రకు గుర్తుగా ప్రత్యేక హామీలు ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నో చేసి చివరకు.. చంద్రబాబును అరెస్ట్ చేసి యువగళం పాదయాత్రను సైకో జగన్ ఆపారని మండిపడ్డారు.
చంద్రబాబుపై అనేక కేసులు పెట్టి జైల్లో బంధించారని మండిపడ్డారు. హైకోర్టులో నిజమే గెలిచిందని లోకేశ్ అన్నారు. 53 రోజుల పాటు ప్రజా పోరాటం జరిగిందని.. చంద్రబాబు గొప్పతనం ప్రపంచం అంతా తెలిసిందన్నారు. తనపై కూడా అనేక కేసులు పెట్టారని.. సీఐడీ విచారణకు పిలిచారని అన్నారు. ఆఖరికి మా అమ్మ భువనమ్మ, నా భార్య బ్రాహ్మణిలను జైలుకు పంపుతామని మంత్రులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. వారికి భయాన్ని పరిచయం చేసే బాధ్యత తనదని లోకేశ్ హెచ్చరించారు.
పార్టీ అకౌంట్లోకి రూ.27 కోట్లు వచ్చాయంటున్నారని.. అవి తమ కార్యకర్తలు సభ్యత్వం కోసం చెల్లించిన రుసుము అని లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. ‘తప్పు చేస్తే చంద్రబాబే నన్ను వదిలిపెట్టరు..’ అంటూ లోకేశ్ తెలిపారు. ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు రుజువు చేయగలరా? అని సవాల్ విసిరారు. ‘సైకో జగన్కు ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ అయ్యిందని మూడు నెలల్లో సైకో పిచ్చాసుపత్రికి వెళ్లడం ఖాయమని లోకేశ్ అన్నారు.