గ్లోబల్ వార్మింగ్(Global Warming) కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి గడ్డకట్టిన మంచు కరుగుతోంది. అయితే ఈ మంచు కరగడం ప్రారంభమైనప్పటి నుంచి మానవ మనుగడకే ముప్పు తలపెట్టే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల ఆర్కిటిక్ ప్రాంతంలో గడ్డకట్టిన స్థితిలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన జాంబీ వైరస్(Zombie Virus)ను శాస్త్రవేత్తలు గుర్తించారు.
దాదాపుగా 48,500 ఏళ్లుగా ఆర్కిటిక్ ప్రాంతంలో ఇది గడ్డకట్టిన స్థితిలో ఉంది. ఆర్కిటిక్, ఇతర ప్రదేశాల్లో చాలా ఏళ్లుగా పలు వైరస్లు మంచులో నిద్రాణస్థితిలో ఉన్నాయి. అయితే వీటి వల్ల కలిగే ప్రమాదాల గురించి శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రమాదకర వైరస్ మానవుల్లో ప్రాణాంతక వ్యాధిని కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని వెల్లడించారు.
ఇలాంటి బ్యాక్టీరియా, వైరస్ లను పునరుజ్జీవింపచేయడం ద్వారా మానవాళికి ఎంత ముప్పును కలిగిస్తాయో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతమున్న యాంటీబయాటిక్స్ వల్ల బ్యాక్టీరియాను కొంతలో కొంత అరికట్టవచ్చని, అయితే వైరస్ ఇందుకు భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. సరైన వ్యాక్సిన్ లేకపోతే వైరస్ మానవాళిపై విధ్వంసం
సృష్టిస్తుందని హెచ్చరిస్తున్నారు.
గతంలో సైబీరియాలో మంచు కరగడం వల్ల రెయిన్ డీర్లలో ఆంత్రాక్స్ వ్యాప్తి కారణం అయిన విషయాన్ని పరిశోధకులు గుర్తు చేశారు. Aix-Marseille విశ్వవిద్యాలయానికి చెందిన జన్యు శాస్త్రవేత్త జీన్-మిచెల్ క్లావేరీ ఇలా అన్నారు. ఈ జాంబీ వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. కొత్త వైరస్లను గుర్తించామని తెలిపారు. ఇవి కరోనా వైరస్లాగే వ్యాప్తి చేయగలవని తెలిపారు.
మరో శాస్త్రవేత్త మారియన్ కూపన్స్ ఇదే విషయాన్ని అంగీకరించారు. ఆర్కిటిక్ శాశ్వత మంచులో ఘనీభవించిన పురాతన “జాంబీ వైరస్”లను సూక్ష్మజీవులు అని కూడా పిలుస్తారు. అవి పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతల సమయంలో విడుదలైతే భూమిపై పెద్ద వ్యాధిని వ్యాప్తి చేస్తాయని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.