తెలంగాణ (Telangana) లో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. మొన్న పెద్దపల్లి జిల్లాలో సామూహిక అత్యాచారం.. మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ.. పాతబస్తీలో మర్డర్.. ఇలా వరుస ఘటనల నేపథ్యంలో ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ మండిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది.
నగరం నడిబొడ్డున 16 ఏళ్ల ఎస్సీ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. 8 మంది మూకుమ్మడిగా ఇంట్లోకి చొరబడి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. మీర్ పేట (Meerpet) లో జరిగిన ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. 8 మంది దుండగులు కత్తులతో బెదిరించి ఇంట్లోకి చొరబడ్డారు. బాలికను బలవంతంగా మూడో అంతస్తులోని ఇంట్లోకి తీసుకెళ్లారు. కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు ఆమెపై అత్యాచారం చేయగా, మిగతా వారు కాపలా ఉన్నట్టు సమాచారం.
బాలిక గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. విషయం తెలిసిన బాధితురాలి సోదరి మీర్ పేట పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం బాలికను సఖి కేంద్రానికి తరలించారు. రాచకొండ సీపీ చౌహాన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు గంజాయి బ్యాచ్ గా అనుమానిస్తున్నారు.
భవనంలోని కింది అంతస్తులో ఉండే టైసన్, మంగళ్ హాట్ కు చెందిన రౌడీషీటర్ అబేద్ లాలా నిందితుల్లో ఉన్నట్లు బాధితురాలి సోదరుడు చెబుతున్నాడు. మరో ఇద్దరు తమ నివాసానికి సమీపంలోనే ఉంటారని పోలీసులకు వివరించాడు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు ఏడు బృందాలుగా గాలింపు చేపట్టారు. నలుగుర్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.