Independence Day : దేశ 77 వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఢిల్లీ ఎర్రకోట (Red Fort) వద్ద మంగళవారం అత్యంత ఘనంగా జరగనున్నాయి. ప్రధాని మోడీ (Modi) రెడ్ ఫోర్ట్ నుంచి దేశ ప్రజలనుద్దేశించి చేయనున్న ప్రసంగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెలబ్రేషన్స్ లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1800 మంది కపుల్స్ ని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. వీరిలో 660 గ్రామాల నుంచి 400 మంది సర్పంచులు, 250 మంది రైతులు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీం కింద, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద 100 మంది రైతులు , సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నుంచి 50 మంది ‘శ్రమయోగీ’ లు ఉన్నారు.
అలాగే ఖాదీ వర్కర్లు, సరిహద్దు రోడ్డు నిర్మాణ కార్మికులు, ప్రైమరీ స్కూలు టీచర్లు, నర్సులు, మత్స్యకారులు కూడా ఇండిపెండెన్స్ డే సంబరాల్లో పాలు పంచుకోనున్నారు. ‘జన్ భగీదరి’ విజన్ కింద రక్షణ మంత్రిత్వ శాఖ ఇందుకు చొరవ తీసుకుంది. ప్రతి రాష్ట్రం నుంచి, లేదా కేంద్ర పాలిత ప్రాంతం నుంచి సంప్రదాయ దుస్తుల్లో 75 మందికి పైగా జంటలు ఈ వేడుకలకు హాజరు కానున్నారు.
నేషనల్ వార్ మెమోరియల్, ఇండియా గేట్, విజయ్ చౌక్, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్, ప్రగతి మైదాన్ వంటి 12 చోట్ల సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. మోడీ ప్రభుత్వం చేబట్టిన వివిధ పథకాలను ఈ పాయింట్ల వద్ద వివరించే విధంగా వీటిని నిర్దేశించారు. గ్లోబల్ హోప్, వ్యాక్సిన్ అండ్ యోగా, ఉజ్వల యోజన, స్కిల్ ఇండియా, నయా భారత్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లాంటి పథకాలను ఇందులో చేర్చారు.
ఈ నెల 15 నుంచి 20 వరకు మై గవర్నమెంట్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ సెల్ఫీ పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు 12 సెల్ఫీ పాయింట్ల వద్ద సెల్ఫీలు తీసుకుని వాటిని ఈ పోర్టల్ పై అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో విజేతకు రూ. 10 వేల చొప్పున ప్రైజ్ మనీ ఇస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.