Telugu News » Ayodhya : అయోధ్య రామయ్యకు… అద్భుతమైన గిఫ్టులు….!

Ayodhya : అయోధ్య రామయ్యకు… అద్భుతమైన గిఫ్టులు….!

రామ మందిరం నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు విరాళాలు ఇస్తున్నారు. గడిచిన మూడేండ్లలో రామ మందిరానికి భారీగా విరాళాలు అందినట్టు సమాచారం.

by Ramu

అయోధ్య (Ayodhya) రామ మందిర ప్రారంభోత్సవానికి మరి కొద్ది రోజులు మాత్రమే మిగిలి వుంది. రామ్ లల్లా (Ram Lalla) విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రామ మందిరం నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు విరాళాలు ఇస్తున్నారు. గడిచిన మూడేండ్లలో రామ మందిరానికి భారీగా విరాళాలు అందినట్టు సమాచారం. ఇప్పటి వరకు రామ మందిరానికి అందిన విరాళాలు, బహుమతుల గురించి ప్రత్యేక కథనం….!

అయోధ్య రామ మందిరానికి ఇప్పటి వరకు సుమారు రూ. 5000 కోట్లకు పైనే విరాళాలు వచ్చినట్టు ట్రస్టు ద్వార తెలుస్తోంది. అదనంగా, ఆన్‌లైన్ లావాదేవీలు, చెక్కులు, నగదు వంటి వివిధ మార్గాల ద్వారా రూ. 2 లక్షల వరకు రోజువారీ విరాళాలు వస్తున్నాయని తెలుస్తోంది. నివేదికల ప్రకారం నెలకు సుమారు కోటి రూపాయల వరకు విరాళాలు అందుతున్నట్టు అంచనా. ఇది ఇలా వుంటే ఇప్పటి వరకు అయోధ్య రామయ్యకు దేశ విదేశాల నుంచి చాలా బహుమతులు వచ్చాయి.

3000 గిఫ్టులను పంపిన నేపాల్ :
సీతా దేవీ జన్మస్థలమైన నేపాల్ లోని జానక్ పూర్ నుంచి అయోధ్యకు 3000 బహుమతులు వచ్చాయి. ఈ గిఫ్టులను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రిసీవ్ చేసుకుంది. ఇందులో వెండి పాదుకలు, ఆభరణాలు, వస్త్రాలు, స్వీట్లు ఇతర బహుమతులు ఇందులో ఉన్నాయి. మొత్తం 30 వాహనాల్లో ఈ బహమతులు ఇటీవల అయోధ్యకు చేరుకున్నాయి.

శ్రీలంక నుంచి బహుమతి:
శ్రీలంక నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం ఇటీవల అయోధ్యలో పర్యటించింది. అశోక వాటిక నుంచి తీసుకు వచ్చిన ఒక రాయిని అయోధ్య ట్రస్టుకు శ్రీలంక ప్రతినిధులు అప్పగించారు. రావణుడు సీతా దేవిని అపహరించుకుని వెళ్లిన తర్వాత అశోక వనంలో సీతా దేవీ ఉన్నట్టు రామాయణం పేర్కొంది. అందువల్ల ఆ అశోక వనం నుంచి రాయిని తీసుకుని వచ్చినట్టు ప్రతినిధులు తెలిపారు.

108 అడుగుల అగరుబత్తి :

గుజరాత్ లోని వడోదరాకు చెందిన వ్యక్తులు రామ మందిరం కోసం భారీ అగరుబత్తిని తయార చేశారు. ఈ అగరుబత్తి బరువు 3,610 కేజీలు ఉంటుంది. 3.5 మీటర్ల వెడల్పు ఉంది. దీని కోసం 376 కిలోల గుగ్గుల్, 376 కిలోల కొబ్బరి చిప్పలు, 190 కిలోల నెయ్యి, 1470 కిలోల ఆవు పేడ , 420 కిలోల వనమూలికలను ఈ అగరుబత్తి తయారీలో ఉపయోగించారు. మరోవైపు 44 అడుగుల ఇత్తడి ధ్వజస్తంబాన్ని కూడా పంపించారు.

అలీఘర్ నుంచి భారీ తాళం :
అయోధ్య రామయ్య కోసం అలీఘర్ కు చెందిన సత్య ప్రకాశ్ శర్మ 400 కిలోల భారీ తాళం, తాళపు చెవిని తయారు చేశారు. ఇది పది అడుగుల ఎత్తు, 4.6 అడుగల వెడల్పు ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోనే ఇదే అత్యంత భారీ తాళపు చెవి అని ఆయన వెల్లడించారు. అటు ఇటావాలోని జలేశ్వర్ నుంచి ఆలయానికి 2100కిలో భారీ గంటను అందజేశారు.

ప్రపంచ గడియారం :

లక్నోకువె చెందిన కూరగాయల వ్యాపారి ఒకరు ప్రపంచ సమయాన్ని తెలిపే గడియారాన్ని అయోధ్యకు బహుమతిగా అందజేశారు. తొమ్మిది దేశాల సమయాన్ని ఈ వాచ్ తెలియజేస్తుంది. ఇందులో ఇండియా, టోక్యో (జపాన్), మాస్కో (రష్యా), దుబాయి (యూఏఈ), బీజింగ్ (చైనా), సింగపూర్, మెక్సికో సిటీ, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ సమయాలను వాచ్ ద్వారా తెలుసుకోవచ్చని దాత అనిల్ కుమార్ సాహు వెల్లడించారు.

7000 కిలోల హల్వా:

అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు పంచేందుకు 7000 కిలోల రామ్ హల్వాను అందిస్తానని నాగ్ పూర్ కు చెందిన ప్రముఖ చెఫ్ విష్ణు మనోహర్ వెల్లడించారు. మధురాకు చెందిన శ్రీ కృష్ణ జన్మస్థాన సేవా సంస్థాన్ 200కిలో భారీ లడ్డూను తయారు చేస్తోంది. అదే విధంగా ప్రాణ ప్రతిష్ట రోజు పంచి పెట్టేందుకు గాను టీటీడీ తరఫున లక్ష లడ్డూలను తయారు చేయిస్తున్నట్టు పేర్కొంది.

5000 డైమండ్స్ పొదిగిన నెక్లెస్ :

సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి ఒకరు అయోధ్య కోసం ప్రత్యేక నెక్లెస్ తయారు చేయించారు. ఇందులో 5000 అమెరిన్ డైమెండ్స్ ను ఇందులో పొదిగారు. దీనికి 2 కేజీల వెండిని ఉపయోగించారు. 40 మంది పనివారు 35 రోజులు శ్రమించి ఈ హారాన్ని తయారు చేశారు. ఇటీవలే ఈ హారాన్ని అయోధ్య ట్రస్టుకు వ్యాపారి అందజేశారు.

బంగారు పాదుకలు :

కరసేవకుడైన తన తండ్రి కోరికను నెరవేర్చేందుకు హైదరాబాద్ కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి కాలి నడకన అయోధ్యకు చేరుకున్నారు. మొత్తం 8000 కిలో మీటర్లు ఆయన పాదయాత్ర చేశారు. బంగారు పూత పూసిన పాదుకలను ట్రస్టుకు అందజేశారు. వడోదరకు చెందిన అరవింద్ బాయ్ మంగళ్ బాయ్ పటేల్ 1100 కిలోల భారీ దీపాన్ని అందజేస్తున్నారు.

 

అజేయ బాణం :

అహ్మద బాద్ కు చెందిన జై భోలే గ్రూపు సభ్యులు ఐదు అడుగుల భారీ అజేయ బాణాన్ని తయారు చేయించారు. ఇందులో ఇనుము, రాగి, ఇత్తడి, వెండి, బంగారం మిశ్రమాన్ని ఉపయోగించారు. ఇది 11.5 కిలోల బరువు ఉంటుందని సభ్యులు తెలిపారు. జనవరి 1 నుంచి 7వ తేదీ వరకు దీన్ని అహ్మదాబాద్ లో ప్రదర్శన కోసం పెట్టారు. అనంతరం అజేయ బాణాన్ని అయోధ్యకు తీసుకు వెళ్లారు.

You may also like

Leave a Comment