– డబుల్ బెడ్రూం ఇళ్లపై అనిశ్చితి
– గ్రేటర్ పరిధిలో 31వేల ఇళ్ల వరకు పనుల పెండింగ్
– ఇప్పటిదాకా రూ.7వేల కోట్ల దాకా ఖర్చు
– కావాల్సింది మరో రూ.1,500 కోట్లే
– పెండింగ్ లో ఇంకో రూ.400 కోట్ల బిల్లులు
– అన్నీ విడుదలైతే 31వేల మందికి లబ్ధి
– కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ
– బడ్జెట్ తర్వాతే క్లారిటీ రానుందా?
ప్రతీ పేదవాడికి ఇల్లు అనే కాన్సెప్ట్ తో అప్పటి బీఆర్ఎస్ (BRS) సర్కార్ డబుల్ బెడ్రూం పథకాన్ని (Double Bedroom Housing scheme) తీసుకొచ్చింది. రాష్ట్రమంతా ఈ పథకాన్ని అమలు చేసినా కొందరికే లబ్ధి జరిగింది. అయితే.. గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) లో మొదటి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టింది. 70 శాతం ఇళ్ల పంపిణీ కూడా జరిగింది. కానీ, మిగిలిన 30 శాతం ఇళ్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు రూ.1,500 కోట్ల నిధులు మాత్రమే అవసరం ఉంది. వాటిలో కొన్నింటికి 10 శాతం పనులు పూర్తికాగా, మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.
2015లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని రూపొందించింది. పేదలకు వంద శాతం రాయితీతో గౌరవప్రదమైన ఇండ్లను నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. గ్రేటర్ హైదరాబాద్ లోని 111 ప్రాంతాల్లో లక్ష ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. కొన్నిచోట్ల పనులు పూర్తవడంతో పలు దఫాల్లో 69వేల ఇళ్ల దాకా పంపిణీ చేసింది. ఇంకో 31వేల ఇళ్ల నిర్మాణ పనులు గత ఏడాదిన్నరగా పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటిదాకా వీటికోసం దాదాపు రూ.7 వేల కోట్లు ఖర్చు చేయగా.. ఇంకో రూ.1,500 కోట్లు విడుదల చేస్తే పనులు పూర్తవుతాయి. అలాగే, ప్రభుత్వం నుంచి రూ.400 కోట్ల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.
కొల్లూరు, చెర్లపల్లి, అమీన్ పూర్, బహదూర్ పల్లి, దుండిగల్, నార్సింగి, శంకర్ పల్లి, నల్లగండ్ల, మురహరిపల్లి, చైతన్యనగర్, రాంపల్లి, తూముకుంట సహా నగరంలోని పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. పట్టణ ప్రాంతాల్లో ఈ ఇండ్ల కేటాయింపుల విషయంలో ఎస్సీ వర్గాలకు 17 శాతం, ఎస్టీ 6 శాతం, మైనారిటీలకు 12 శాతం, ఇతరులకు 65 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. ఈ నేపథ్యంలో పెండింగ్ పనులపై అనిశ్చితి నెలకొంది. డబుల్ బెడ్రూం ఇళ్లపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. బడ్జెట్ విడుదల తర్వాతే ఈ విషయంలో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
మరోవైపు, డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్న ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నందున ఇంటర్నెట్/బ్రాడ్ బ్యాండ్, కేబుల్ టీవీ సేవలు ప్రస్తుత సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే.. జీహెచ్ఎంసీ పరిధిలో లేని డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో, వారికి ఇంటర్నెట్/బ్రాడ్ బ్యాండ్, కేబుల్ టీవీ సేవల కోసం మౌలిక సదుపాయాలను అందించాలని కూడా అంటున్నారు. పలు ప్రాంతాల్లో ఈ సేవలను అందించేందుకు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి టెండర్లను కూడా ఆహ్వానించారు. ప్రతీ డబుల్ బెడ్రూంకు ఒకే రకమైన సేవలను అందించేందుకు గతంలో అనుభవం ఉన్న సర్వీస్ ప్రొవైడర్లు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.