ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ (BJP) కుట్రలు చేస్తోందన్నారు. తమ పార్టీ ఎమ్మేల్యేలకు డబ్బులతో ఎర వేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇప్పటికే తమ ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు సంప్రదింపులు మొదలు పెట్టారని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగా ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆప్ కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు డబ్బులతో వల వేయాలని బీజేపీ చూస్తోందన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఇచ్చి తమ వైపు లాక్కోవాలని బీజేపీ కుట్రలు పన్నుతోందని వెల్లడించారు. త్వరలోనే మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళతారని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఆప్ కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని బీజేపీ నేతలు చెప్పినట్టు వివరించారు. ఆయా నేతలకు రూ. 25 కోట్లతో పాటు రాబోయే ఎన్నికల్లో బీజేపీ టికెట్ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్టు ఆరోపణలు చేశారు.
కానీ ఆప్ ఎమ్మెల్యేలు కాషాయ పార్టీ ఆఫర్ను తిరస్కరించారని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. లిక్కర్ స్కామ్ పై దర్యాప్తు కోసం తనను అరెస్టు చేయడం లేదని కేవలం తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎన్నో కుట్రలు పన్నారని.. కానీ అవి ఏవీ సక్సెస్ కాలేదన్నారు.