భైరాన్ పల్లి.. తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా లో పోరాటాల పురిటి గడ్డ.నిజాం నిరంకుశ పాలనకు తిరుగుబాటు బావుటా ఎగురేసిన వీర భూమి.అమాయకుల రక్తం మరిగిన ఖాశింరజ్వీ(Kashimrajvi) రాక్షసత్వానికి మరిగిన రక్తం కన్నెర్రజేస్తే ఎలా ఉంటుందో రుచిచూపించిన ధీర భూమి.
భూమి కోసం, భుక్తి కోసం ,రైతు సైనికుడిగా మారి అరాచక పాలనకు లెక్కలు తేల్చిన మహోగ్ర భూమి. ఊరే ఉద్యమంగా మారి నిజాం సేనను నిలువరించింది, ఆయుధానికి ఆయుధంతోనే సమాధానం చెప్పింది.
నాటి నిజాం పాలనకు వ్యతిరేకంగా గొంతు విప్పినందుకు గెండెల్లో తుపాకీ తూటాలను దించారు. గ్రామం రక్తశిక్తమయ్యింది. ఆ రక్త చరిత్రకు ఇప్పుడు 75 ఏళ్లు.ఈ రోజు( ఆగస్టు 27) నేల నెత్తురుతో తడిసి, మేఘాలు కన్నీటి మేఘాలుగా వర్షించిన రోజు.
1947 ఆగస్టు 15న భారత దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చినా తెలంగాణా మాత్రం నిజాం ఉక్కు పాదం కింద నలిగిపోతూనే ఉంది. కాల్మొక్కుతా బాంచన్ అంటూ గంగిగోవులాంటి మనుషులున్న ఈ నేల..ఒక్క సారిగా సింహ గర్జన చేసింది. గ్రామ రక్షణ దళాలు(Village Defense Forces)గా ఏర్పడి నిజాం సైన్యం గుండెల్లో నిద్రపోయింది.
నిజాం సేనలు లింగాపూర్(Lingapur ),దూళిమెట్ట(Dholli metta) ప్రాంతాలను దోచుకుని వస్తున్న రజాకార్లు భైరాన్ పల్లిమీదుగా వెళ్తున్నారు. అప్పటికే గ్రామ రక్షణ దళాలుగా ఏర్పడ్డ భైరాన్ పల్లిప్రజలు మాకెందుకని ఊరుకోలేదు.
రజాకార్లకు ఎదురు నిలిచారు..ఆ గ్రామల్లో దోచుకున్న సొమ్మును విడిపించి రజ్వీసేనలకు ధిక్కార స్వరాన్ని వినిపించారు. దీంతో రగిలిపోయిన నిజాం సైన్యం రెండుసార్లు దాడి చేసింది..మొక్కవోని విశ్వాసంతో భైరాన్ పల్లి ప్రజలు రజ్వీ సేనలను తరిమి కొట్టారు.
ఈ దాడిలో 20 మంది రజాకార్లు చనిపోయారు. దీంతో భైరాన్ పల్లి వీరాన్ పల్లి అయ్యింది.రజాకార్ల రక్తదాహానికి మరింత ఆజ్యం పోసింది ఆ తిరుగబాటు ఘటన. అప్పటి భువన గిరి డిప్యూటీ కలెక్టర్ ఎప్పటికైనా భైరాన్ పల్లిని నామరూపాలు లేకుండా చెయ్యాలని కత్తిగట్టాడు.
ఎప్పటికైనా భైరాన్ పల్లి రజాకార్ల చేతిలో బలవ్వాల్సిందే అని తీర్మానించుకున్నారు. రజాకార్లకు దొరక్కుండా పారిపోండి అని చేసిన హెచ్చరికలు పూర్తి స్థాయిలో గ్రామస్తులకు చేరలేదు.
ప్రతీకారంతో ఉన్న రజాకార్లు హైదరాబాద్ నుంచి వచ్చిన 500 మంది సైనికులను రప్పించి గ్రామాన్ని మోహరించారు. 1948 ఆగస్టు 27న తెల్లవారు జామున భైరాన్ పల్లిపై విరుచుకుపడ్డారు.
ప్రతి ఇంటిపైకి దాడిచేసి పిల్లలు,ముసలి వాళ్లు, మహిళు,బాలింతలు అని చూడకుండా ఊచకోత కోశారు. మహిళలను వివస్త్రలుగా చేసి శవాల గుట్టల చుట్టూ బతుకమ్మలు ఆడించారు. ఆ ఒక్కరోజులోనే 96 మందిని చంపేశారంటే వారు రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
గ్రామ నడిమధ్యలో ఉన్న బురుజును ప్రధాన రక్షణ కేంద్రంగా చేసుకుని గ్రామరక్షణ దళాలు సాగించిన పోరు ఆ దాష్టికాలను నిలువరించలేకపోయింది. ఈ నరమేధంలో 118 మంది చనిపోయారు. కానీ ఆ సంఖ్య 150 పైనే ఉంటుందని వృద్ధులైన గ్రామస్తులు ఇప్పటికీ ఆవేదనతో చెబుతారు.
ఎంత మంది నేలకు ఒరిగినా ..మొండి ధైర్యంతో కొండని ఢీకొని, విజయమో వీర స్వర్గమో అని ముందుకు ఉరికిన ఆ ఊరి పోరాట పఠిమ తెలంగాణా ప్రాంతానికే కాదు దేశానికే ఆదర్శం. పోరాట పఠిమకు గుర్తుగా భైరాన్ పల్లి ఊరి పొలిమేరలో అమరవీరుల స్థూపం నిర్మించారు.
వీర భైరాన్ పల్లికి ప్రత్యేక గుర్తింపు తెస్తామని వాగ్దానాలు చేసిన నేటి పాలకులు ఆ ఊరి త్యాగాన్ని మరచిపోవచ్చు. ఊపిరున్నది బానిస సంకెళ్లు తెంచుకునేందుకే అని నినదించిన నడిబొడ్డులో నిలిచిన బురుజు మరచిపోదు.
ఆ వీర భూమిలో సమాధి అయిన ఎన్నో త్యాగాలు ఆ గాలిలో ,నీటిలో, నింగిలో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. చరిత్ర పుఠల్లో ఆ పచ్చినెత్తురు ప్రజ్వలిస్తూనే చేతికి తగులుతుంది.