తెలంగాణ రాజకీయాలపై సీపీఐ (CPI) నారాయణ (Narayana) చేసే కామెంట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. బీఆర్ఎస్ (BRS) బీజేపీ (BJP) కాంగ్రెస్ (Congress) పార్టీల పై ఇప్పటికే ఎన్నో సార్లు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం వినే ఉన్నాం.. కాగా మునుగోడు లో జరిగిన ఉపఎన్నికలలో పొత్తుకి సై అన్న బీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పొత్తుకి నై అనడంతో కామ్రేడ్స్ కాస్త బీఆర్ఎస్ పై గుర్రుగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో సారి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు..
కలల ప్రపంచం కాదది కన్నీళ్ల ప్రపంచమన్న నారాయణ.. కూలిపోతున్న బ్రిడ్జిలు, కల్వర్టులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయనే సంకేతాలని ప్రకృతి ఇస్తున్నదని ఎద్దేవా చేశారు. సీపీఐ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డితో కలిసి కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి పనులను పరిశీలించిన నారాయణ బీఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.. అందం పై ఆసక్తి ఉన్న వ్యక్తి తెల్ల వెంట్రుకలకు నల్లరంగు వేసి ఎలా సోకులు పడతాడో.. ఈ బ్రిడ్జి పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉందని విమర్శించారు..
హైదరాబాద్, కరీంనగర్‌లో హ్యాంగింగ్ బ్రిడ్జి (Cable Bridge) నిర్మించామని గొప్పలు చెప్పుకొంటున్న తండ్రి కొడుకులకి.. నీళ్లు నిలబడాలంటే చెక్‌డ్యాములు గట్టిగా ఉండాలని తెలియదా అని ప్రశ్నించారు. గట్టిగా వచ్చిన ఒక్క వర్షానికి కొట్టుకు పోయే చెక్‌డ్యాములు నిర్మించడం వెనక డబ్బు దండుకోవాలన్న దుర్బుద్ధి తప్ప మరొకటి కనపడటం లేదని నారాయణ విమర్శించారు. మీరు కట్టిన బ్రిడ్జ్.. అందాల బ్రిడ్జి కాదని అడ్డగోలు దోపిడీకి తెరచిన లిక్కర్ షాప్ అని దుయ్యబట్టారు..
మరోవైపు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి లో నాణ్యత లేదని ఆరోపించిన నారాయణ.. క్వాలిటీ లోపం కారణంగా తారు లేచిపోతుండటంతో గుత్తేదారు మరమ్మతులు చేపట్టడం ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నట్టే అని విమర్శించారు.. మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్న నారాయణ.. సుందరీకరణ పేరుతో హడావుడిగా నిర్మాణాలు చేపట్టడం వల్ల నాణ్యత కొరవడి రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని ఆగ్రహించారు.