ప్రతీఒక్కరు ధనవంతులు కావాలని కలలుగనడం సహజం. అయితే అందుకు కావాల్సిన ప్రణాళికలు వేసుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. అందుకు అనుగుణంగా వచ్చే ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయాలి? మిగిలిన డబ్బును ఎలా పొదుపు చేయాలో అనేక మార్గాలను అన్వేషిస్తారు. జీవితంలో ఉన్నతస్థాయికి చేరాలని కోరుకునే ప్రతీఒక్కరూ ఈ ప్రయాణంలో ఆర్థికంగా ఎంతో కొంత మెరుగుపడుతుంటారు.
తాజాగా మిలియనీర్, ప్రముఖ రచయిత డేవిడ్ బాష్ (David Bach) అలాంటి వారి కోసం ఓ ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. ధనవంతులుగా మారాలనుకుంటున్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. డేవిడ్ బాష్ ఏం చెప్పారంటే.. ‘ప్రతీ వ్యక్తి తన ఆదాయం (Income) లో కనీసం 14శాతం పక్కకు పెట్టాలని సూచిస్తున్నారు. మనిషి తన జీవితంలో సగటున 9,000 గంటలు పనిచేస్తారని ఆయన అంచనా వేశారు. ఈ లెక్కన 14 శాతం అంటే రోజుకి ఒక గంట ఆదాయాన్ని (Income) పక్కన పెట్టాలని సూచిస్తున్నారు.
మనం చేస్తున్న సమయంలో మొదటి గంట ఆదాయాన్ని మనకు మనమే చెల్లించుకోవాలని చెబుతున్నారు. ఒక వ్యక్తి సంపాదించే ఆదాయం పన్నులు, అద్దెలు, లోన్ల చెల్లింపులు, ఆరోగ్యం, ఆహారం, క్రెడిట్ కార్డు, రవాణా.. ఇలా అనేక అవసరాలకు వెళ్లిపోతుంది. ఈ ఖర్చులన్నింటి తర్వాత పొదుపు (Savings) చేయడానికి ఒక్క రూపాయి కూడా చేతిలో ఉండదు. అందుకే ప్రతీరోజు ఒక గంట ఆదాయాన్ని ముందుగానే మీకు మీరే చెల్లించుకోవాలి.
డేవిడ్ బాష్ చెప్పిన ఈ ఒక్క చిన్న టిప్ ఫాలో అయిపోతే చాలు మీరు అనుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటారు. చాలామంది రిటైర్ అయ్యాక డబ్బులు లేవని బాధపడే బదులుగా ఇలా డేవిడ్ బాష్ చెప్పిన టిప్‌ను ఓ అలవాటుగా మలుచుకుంటే ఆర్థిక ఇబ్బందులుండవు. అదేవిధంగా సమయాన్ని ఏమాత్రం వృథా చేయకూడదు. సరైన నిద్ర, ఆహారం తీసుకోవడమూ భవిష్యత్తును నిర్ధేశిస్తుంది.