వన్డే ప్రపంచ కప్-2023(Wold Cup-2023) వరుస ఓటములతో సతమతమవుతున్న పాకిస్తాన్ టీమ్(Pak Team) లో మరో వివాదం చెలరేగింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్(Whatsapp Chat Leak) అయింది. వరుస పరాజయాలతో కెప్టెన్‌గా విఫలమవుతున్న బాబర్‌కు మరో తలనొప్పి వచ్చిపడినట్లైంది.
పాకిస్తాన్ జట్టుకు బోర్డు నుంచి సరైన సహకారం లేదని, గత 5 నెలలుగా జీతాలు ఇవ్వలేదని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ విషయం గురించి పాక్ కెప్టెన్ బాబర్ అజామ్.. పీసీబీ చీఫ్ జకా అష్రఫ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించినా, మెసేజ్ చేసినా అతడు రియాక్ట్ అవ్వలేదని మాజీ కెప్టెన్ లతీఫ్ రషీద్ పేర్కొన్నాడు. అంతేకాదు బాబర్, పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ అయింది.
బాబర్ అజామ్, సల్మాన్ నసీర్ వాట్సాప్ చాటింగ్ ఇలా ఉంది. ‘బాబర్ అజామ్.. నువ్వు ఫోన్ చేస్తే ఛైర్మన్ స్పందించడం లేదని టీవీల్లో, సోషల్ మీడియాలో న్యూస్ వస్తోంది. నువ్వు ఈ మధ్య ఏమైనా ఛైర్మన్‌కు ఫోన్ చేశావా..?’ అని నసీర్ అడిగాడు. ‘నమస్తే సల్మాన్ భాయ్.. నేను జకా అష్రఫ్‌కు కాల్ చేయలేదు..’ అని బాబర్ రిప్లై ఇచ్చాడు.
బాబర్ ప్రైవేట్ చాట్‌ను లీక్ చేయడంపై పాక్ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పీసీబీ చీఫ్ జకా అష్రఫ్ ఓ టీవీ ఛానల్‌లో ప్రస్తావించారు. అతడే ఈ చాట్‌ను లీక్ చేశాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే లీకైన చాటింగ్ ఎంత మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్థాన్ పేలవమైన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా అందులో రెండింటిలో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో పాక్ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. సెమీస్ అవకాశాలు కష్టంగా మారాయి.