పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని లక్షలు ముట్టజెప్పి ప్రైవేట్ కాలేజీ(Private College)ల్లో చేర్పిస్తున్నారు. అయితే కళాశాల యాజమాన్యాలు ర్యాంకుల వేటలో పడి విద్యార్థిలను టార్చర్ చేస్తున్నాయి. తాజాగా ఓ కళాశాల యాజమాన్యం పెట్టిన ఒత్తిడికి తట్టుకోలేక ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి(Inter first year student) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన మీర్పేట్ పోలీస్‌స్టేషన్(Meerpet Police station) పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓం సాయినగర్ కాలనీకి చెందిన కృష్ణవేణి, ఆనంద్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఎం.వైభవ్(16) నారాయణ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండవ కుమారుడు 7వ తరగతి చదువుతున్నాడు. వైభవ్ 10వ తరగతిలో 8.3జీపీఏ సాధించాడు.
అయితే వైభవ్ మంగళవారం ఉదయం 6.30గంటలకు ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించేలోపే వైభవ్ మృతిచెందాడు. అయితే కాసేపటికి అక్కడ ఓ సూసైడ్ లెటర్ లభ్యమైంది. కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కాసేపటికే అక్కడ వైభవ్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు.
వైభవ్ రాసిన సూసైడ్ నోట్లో ఏముందంటే.. ‘వైభన్ అనే నేను చైతన్యపురిలోని నారాయణ కాలేజ్‌లో చదువుతున్నాను. ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని కళాశాల లెక్చరర్లు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ నన్ను టార్చర్ పెడుతున్నారు. నా సోదరుడిని ఎట్టి పరిస్థితుల్లో నారాయణ కాలేజీలో చేర్చవద్దు. నా జీవితంలో ఇదే చివరి రోజు. విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేయకండి.. నా సోదరున్ని మంచి కాలేజీలో చేర్పించండి.. అతడి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా.. సారీ మమ్మీ, డాడి, సోదరా.. సారీ టు ఆల్..’ అని ఆ లెటర్లో రాసి ఉంది. నారాయణ కాలేజ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేదిలేదని కుటుంబ సభ్యులు భీష్మించికూర్చున్నారు.