Telugu News » Assembly Elections 2023: తెలంగాణ అభివృద్ధి ఇదా !.. రేపటి పౌరుల చదువులకు ఇన్ని అడ్డంకులా ..??

Assembly Elections 2023: తెలంగాణ అభివృద్ధి ఇదా !.. రేపటి పౌరుల చదువులకు ఇన్ని అడ్డంకులా ..??

అభివృద్ధి అంటే కేవలం లక్షలు, కోట్లు పోసి కట్టుకున్న, కొనుకున్న అపార్టుమెంట్​లు, విల్లాలేనా? ధనికుల కాలనీలలో పార్కులు, వాకింగ్​ ట్రాకులు, ఓపెన్​ జిమ్ములు, క్రీడా మైదానాలు, షటిల్​ కోర్టుల వంటి సదుపాయాలేనా? కార్లలో రయ్యిమని దూసుకు పోవడానికి నిర్మించిన ఫ్లైఓవర్​లు, బ్రిడ్జిలేనా...?

by Venu

అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections)వేళ నేతల నోటి నుంచి తెలంగాణ (Telangana) అభివృద్ధి (Development)లో నంబర్​‌వన్ స్థానంలో ఉందనే మాటలు నిత్యం వినిపిస్తున్నాయి. మరి నేతలు చెబుతున్నట్టు అభివృద్ధి జరిగిందా అంటే జనం తెల్లముఖం వేస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం లక్షలు, కోట్లు పోసి కట్టుకున్న, కొనుకున్న అపార్టుమెంట్​లు, విల్లాలేనా? ధనికుల కాలనీలలో పార్కులు, వాకింగ్​ ట్రాకులు, ఓపెన్​ జిమ్ములు, క్రీడా మైదానాలు, షటిల్​ కోర్టుల వంటి సదుపాయాలేనా? కార్లలో రయ్యిమని దూసుకు పోవడానికి నిర్మించిన ఫ్లైఓవర్​లు, బ్రిడ్జిలేనా…? పేదల పిల్లలు చదువుకుంటున్న విద్యాలయాలు ఈ వేల కోట్ల అభివృద్ధి పుస్తకంలో మచ్చుకైనా కనిపించావా? అని ప్రశ్న ఉదయించని సామాన్యుడు లేడని అంటున్నారు.

ఇక కూకట్​పల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమావేశం నిర్వహించిన ఊకదంపుడు ఉపన్యాసాలతో రానున్న ఎన్నికలలో ఓట్లు దండుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారని అనుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడిబాట కార్యక్రమం.. ఇప్పటి వరకు కూకట్​పల్లి, బాలానగర్​ మండలాల బాట పట్టలేదు. ఈ నియోజకవర్గం పరిధిలో అత్యధిక శాతం ప్రభుత్వ పాఠశాలలు (Government Schools) కమ్యూనిటీ హాల్​లు.. పశువుల కొట్టం కన్న దారుణంగా మారి శిథిలావస్థకు చేరుకున్న భవనాలలో చదువులు కొనసాగుతూ ఉండటం విడ్డూరం..

వీటిని చూస్తుంటే ప్రభుత్వ పాఠశాలలో కార్పోరేటర్​ విద్యని అందిస్తూ, విద్యా ప్రమాణాలు పెంచాము అని చెప్పిన మాటలన్ని గాలి మాటలని అర్థం అవుతున్నాయంటున్నారు. మరోవైపు కొన్ని ప్రభుత్వ పాఠశాల భవనాల దీన గాధలు వర్ణనాతీతం. ఈ నియోజకవర్గం పరిధిలోని కూకట్​పల్లి ప్రకాష్​నగర్​, దయాపూర్​గూడ, బాలానగర్​ డివిజన్​ పరిధి ఫతేనగర్​, గౌతమ్​ నగర్​, బోరబండ రాజు కాలనీ, మూసాపేట్​, అంజయ్య నగర్​, వివేక్​నగర్​ కాలనీలలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొత్తం వేలాది మంది విద్యార్థులు చదువుకొంటున్నారు.

వీరంతా కనీస మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేని శిథిలావస్థకు చేరుకున్న భవనాలో విద్యనభ్యసిస్తున్నారు.. ఇవేవీ ప్రభుత్వ పెద్దల కంటికి కనిపించడం లేదా ? అని ఇక్కడ చదువుకొంటున్న పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎన్నికలు వచ్చిన ప్రతి సారి హంగామ చేయడం పాఠశాలలకు మహార్ధశ కల్పిస్తాం అంటు గాలిమాటలు చెప్పడం నేతలకు అలవాటు అయ్యిందని అనుకుంటున్నారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజి మాత్రమే కాదు, విద్యా ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు కల్పించండని ప్రజలు కోరుకుంటున్నారు.. పేద విద్యార్థులకు సరియైన విద్యనందించే విద్యాలయాలే అధ్వాన్నంగా ఉంటే అభివృద్ధి ఎక్కడ జరిగినట్టని ప్రశ్నిస్తున్నారు..

You may also like

Leave a Comment