Modi : అవిశ్వాసంపై చర్చ.. ప్రధాని మోడీపైనే అందరి కళ్ళుతన ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం మీద ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) గురువారం లోక్ సభలో సమాధానమివ్వనున్నారు. ఈ చర్చలో ఆయన ఏం మాట్లాడుతారన్న దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. తీర్మానంపై మూడోరోజున కూడా చర్చ సందర్భంగా పార్లమెంట్ దద్దరిల్లవచ్చునని భావిస్తున్నారు. ఇప్పటికే నిన్న లోక్ సభలో కాంగ్రెస్ (Congress) అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ..మణిపూర్ అంశంపై సభలో దుమారం రేపారు. ఆ రాష్ట్రంలో భరత మాతను హత్య చేశారని ఆరోపించారు. మోడీని రావణుడితో పోల్చారు.
రాహుల్ చేసిన ప్రసంగంపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం ప్రకటిస్తూ కొంతసేపు సభను స్తంభింపజేశారు. ఇక కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ… రాహుల్ అనుచితంగా ప్రవర్తించారని, ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ చేసిన ఆరోపణ పెను సంచలనం రేపింది. అయితే తమ నేత తప్పేమీ చేయలేదని, నిజానికి ఆయన అంటే బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నేతలు సమర్థించుకున్నారు. కాగా రాహుల్ చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తూ హోమ్ మంత్రి అమిత్ షా సుదీర్ఘంగా ప్రసంగించారు. మణిపూర్ అంశంలో ప్రభుత్వ తప్పిదమేమీ లేదని, ఆ రాష్ట్ర పరిస్థితిపై చర్చకు తామెప్పుడూ సిద్ధమేనని ప్రకటించారు.
అవిశ్వాసం పై గురువారం లోక్ సభలో బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రసంగించనున్నారు. గురువారం ప్రధాని మోడీ లోక్ సభలో చర్చకు సమాధానమివ్వనున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ధృవీకరించారు. మోడీ సభకు వచ్చి మాట్లాడాలన్న విపక్షాల డిమాండ్ ను తాము వ్యతిరేకించడం లేదని ఆయన చెప్పారు. మణిపూర్ అంశంపై ఈ నెల 11 న చర్చ చేబట్టేందుకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ప్రతిపక్షాలు ఇందుకు అభ్యంతరం ప్రకటించాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆ రోజుతో ముగియనున్నాయని, అందువల్ల ముందే చర్చ చేబట్టాలని డిమాండ్ చేశాయి. లోక్ సభలో 331 మంది సభ్యులున్న ఎన్డీయే.. ఈ అవిశ్వాస తీర్మానాన్ని సులభంగా నెగ్గించుకోగలదని భావిస్తున్నారు. ఒక్క బీజేపీకే 303 మంది ఎంపీలు ఉండగా.. మెజారిటీ మార్కు 272. ఇక విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యుల సంఖ్య 144 కాగా మిత్ర పక్షాలతో కలుపుకుంటే ఈ సంఖ్య 152 కి పెరుగుతుంది. అయితే ఇందుకు బీఆర్ఎస్ కు చెందిన 9 మంది ఎంపీల ఓట్లను ఇది సాధించవలసి ఉంటుంది. వైసీపీ, బీజేడీ పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాయి. లోగడ లోక్ సభలో 27 అవిశ్వాస తీర్మానాలను విపక్షాలు ప్రవేశపెట్టాయి. అయితే ఇవన్నీ వీగిపోవడమో, అసంపూర్తిగా మిగిలిపోవడమో జరిగింది. కానీ విశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా కనీసం మూడు సార్లు ప్రభుత్వాలు పడిపోయాయి.