అయ్యప్ప మాలధారణ విషయంలో కొన్ని ప్రైవేట్ స్కూళ్లు(Private Schools) అతిగా ప్రవర్తిస్తున్నాయి. విద్యార్థులు అయ్యప్ప మాల వేసుకుంటే నో ఎంట్రీ చెబుతున్నాయి. దీనిపై హిందూ సంఘాలు ఎన్నిసార్లు ధర్నాలు చేసి నిరసన తెలిపినా మార్పు రావడం లేదు. తాజాగా రంగారెడ్డి (Ranga Reddy) జిల్లాలో అయ్యప్ప మాల ధరించిన విద్యార్థులను స్కూల్ లోకి రానివ్వలేదు. దీంతో పాఠశాల యాజమాన్యం తీరుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
విద్యార్థులను స్కూల్ బయట నిలబెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సదరు స్కూల్ యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మొయినాబాద్ లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన కొందరు విద్యార్థులు అయ్యప్ప మాల వేసుకున్నారు. ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్లగా.. దీనిపై యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులను స్కూల్ బయటే నిలబెట్టింది.
తమను లోపలికి రానివ్వడం లేదని తల్లిదండ్రులకు విద్యార్థులు తెలియజేశారు. దీంతో వెంటనే తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. మరి కొన్ని రోజుల్లో అయ్యప్ప దీక్ష ముగుస్తుందని, అంత వరకు విద్యార్థులను అనుమతించాలని బతిమాలి నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు.
కానీ విద్యార్థులను అనుమతించేందుకు స్కూల్ యాజమాన్యం ససేమేరా అంది. విద్యార్థులు అయ్యప్ప మాల వేసుకుని పాఠశాలకు వస్తే సమస్య ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నించారు. అయినా, సరైన సమాధానం చెప్పలేదు. ఈ విషయం హిందూ సంఘాలకు తెలియడంతో స్కూల్ యాజమాన్యం తీరుపై మండిపడుతున్నాయి. హిందూ దేశంలో ఇలాంటి వివక్ష ఏంటని ప్రశ్నిస్తున్నాయి.