తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) నవంబర్ 30న జరగనున్న నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా భారీగా నగదు, మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు పోలీసులు భారీగా నగదు, మద్యంతో పాటు బంగారం, డ్రగ్స్, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ సర్కార్ ఎన్నికల కోడ్ అమలు చేసినప్పటి నుంచి పోలీసు శాఖను అప్రమత్తమైంది. దీంతో ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అక్టోబర్ 9న ఎన్నికల కోడ్‌ను అమలు చేయగా అక్టోబర్ 31నాటికి స్వాధీనం చేసుకున్న సొత్తు సుమారు రూ.400 కోట్ల మార్కును దాటిందని అధికారులు చెబుతున్నారు. 24 గంటల వ్యవధిలోనే రూ.16.16 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం విశేషం.
అక్టోబరు 9 నుంచి మొత్తం జప్తు రూ.412.46 కోట్లకు చేరిందని, ఇంత తక్కువ వ్యవధిలో దేశంలో ఇదే అత్యధికమని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో 2018 ఎన్నికల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియలో మొత్తం నగదు, బంగారం స్వాధీనం కేవలం రూ.103 కోట్లు మాత్రమే పట్టుబడింది. ఆ రికార్డు కొద్దిరోజుల్లోనే చెరిగిపోయింది.
చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం విడుదల చేసిన డేటా ప్రకారం.. అక్టోబర్ 30 ఉదయం 9 నుంచి అక్టోబర్ 31 ఉదయం 9 గంటల మధ్య రూ.2.76 కోట్ల విలువైన లోహాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఇప్పటివరకు 251 కిలోల బంగారం, 1,080 కిలోల వెండి, వజ్రాలు, ప్లాటినం మొత్తం రూ.165 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నాయి. మద్యం సరఫరాపై కూడా అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 24 గంటల వ్యవధిలో రూ.4.17 కోట్ల విలువైన మద్యం పట్టుబడగా, మొత్తం రూ.39.82 కోట్లకు చేరింది.