తెలంగాణ శాసనసభ ఎన్నికల(Telangana Assembly Elections) నేపథ్యంలో ఓటు నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు నిన్నటితో (అక్టోబర్ 31) ముగిసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ కొత్తగా నగరంలో నమోదైన ఓటర్ల వివరాలను వెల్లడించారు. శనివారం ఒక్క రోజే (అక్టోబర్ 28న) హైదరాబాద్ నగరంలో 15 వేల కొత్త ఓటర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వెల్లడించారు.
ఫారం-6 మొత్తం దరఖాస్తుల సంఖ్య 1.35 లక్షలకు చేరుకుందని వీటిలో 83 వేల దరఖాస్తులు వెరిఫికేషన్ అయిపోయిందని హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ వెల్లడించారు. దీంతో నగరంలో మొత్తం ఓటర్ల సంఖ్య 45 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశారు.
హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు బూత్ లెవల్ ఆఫీసర్( బీఎల్ ఓ)ల ద్వారా ఇంటింటికి స్టిక్కర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. తుది జాబితా ప్రచురించిన తర్వాత ఓటరు సమాచారంతో కూడిన కరపత్రాన్ని కూడా ఓటర్లకు అందజేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లు కీలకంగా మారనున్నారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు నమోదు చేసుకునేలా ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేలా భారత ఎన్నికల సంఘం యువతలో చైతన్యాన్ని నింపేందుకు అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా అర్హులైన ప్రతీ ఒక్కరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.