Telugu News » Tirumala : తిరుమలలో ఉన్నశంఖనిధి, పద్మనిధి ఎవరు..వారి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసా.. !

Tirumala : తిరుమలలో ఉన్నశంఖనిధి, పద్మనిధి ఎవరు..వారి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసా.. !

శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ముందు వారు ఎవరో ముందు తెలుసుకుందాం. శంఖనిధి,పద్మనిధులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు.

by Venu

తిరుమల (Tirumala) గిరులు ఎన్నో రహస్యాల సిరులు.. స్వయంభూగా ఆ శ్రీవారు వెలిసిన తిరుమల చరిత్ర అమోఘం.. అద్భుతం.. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండ, ఆనంద నిలయంలో అవతరించాడు. తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. సప్తగిరులని పిలువబడే తిరుమలలో ఉన్న ఏడుకొండలకి ఎంతో విశేష చరిత్ర ఉంది.. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడు పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి.

ఆ ఏడు శిఖరాలూ… శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి అని చెబుతారు. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధ నిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమల గిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర. ఈ సప్త గిరుల్లో మనకు తెలియని ఆలయాలు, విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో శంఖనిధి (Shankhanidhi) పద్మనిధి (Padmanidhi) విగ్రహాల (Idols) గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ముందు వారు ఎవరో ముందు తెలుసుకుందాం. శంఖనిధి,పద్మనిధులు శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy)వారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమవైపున అంటే దక్షిన దిక్కున ఉన్న రక్షకదేవత పేరు శంఖనిధి, అలాగే కుడి ప్రక్కన ఉత్తర దిక్కున ఉన్న రక్షకదేవత పేరు పద్మనిధి.. శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ధరించి వుంటాడు. పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి.

వీరు తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాల రూపంలో ఉన్నారు. తిరుమల ఆలయంలోకి ప్రవేశించే ముందు మనం మనకాళ్ళను ప్రక్షాళన చేసుకునే దగ్గర శ్రీవారి ఆలయం గడపకు ఇరుప్రక్కలా వీరు కనిపిస్తారు. ఇక ఈ నిధి దేవతల పాదాలవద్ద ఆరంగుళాల పరిమాణంగల రాజవిగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండడం గమనించవచ్చు.

ఈ విగ్రహన్ని విజయనగర రాజైన అచ్యుతదేవరాయలు ప్రతిష్టించారని చెబుతారు. బహుశా అచ్యుతదేవరాయలే ఈ నిధి దేవతలను కూడా ప్రతిష్టించి ఉండవచ్చని సందేహం.. కాగా ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయడం సంప్రదాయం.

దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడు ప్రాకారాలు కలిగిన ఆలయమని తెలుస్తోంది. ఇక శంఖనిధి, పద్మనిధి విగ్రహాలను ఇంతకు ముందు తిరుమల వెళ్ళిన వారు గమనించి ఉండకపోతే ఈసారి శ్రీవారి దర్శనం కోసం వెళ్ళినప్పుడు గమనించి నమస్కరించి ఆలయంలో ప్రవేశించండి..
సర్వేజనా సుఖినో భవంతు.. జై శ్రీమన్నారాయణ..

You may also like

Leave a Comment