ఏపీ (AP)లో అధికార వైసీపీకి (YCP).. టీడీపీ (TDP)కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందన్న విషయం తెలిసిందే.. టీడీపీ అధినేత జైలు నుంచి బయటికి వచ్చాక ఆ పార్టీ కార్యకర్తల్లో కాస్త హుషారు వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ నేపధ్యంలో అధికార పార్టీ పై విమర్శల జోరు పెంచితే గాని ఓటర్ల దృష్టిలో పడమని భావించిన టీడీపీ ఆ దిశగా పావులు కడుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక వైసీపీపై మాటల దాడి చేయాలంటే టీడీపీలో రెడ్డి సామాజికవర్గం నుంచి సోమిరెడ్డి (Somireddy) ఒక్కరే కనిపిస్తారు. టీడీపీలో కీలక నేత అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ నేత మాత్రమే కాకుండా రెడ్డి సామాజికవర్గం కూడా కావడంతో చంద్రబాబు ఆయనకు స్పెషల్ ప్రయారిటీ ఇస్తారనే టాక్ పార్టీ వర్గాలలో ఉంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ (Jagan)పై కీలక వ్యాఖ్యలు చేశారు సోమిరెడ్డి..
చంద్రబాబు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము జగన్ కి లేదని సోమిరెడ్డి విమర్శించారు. బాబు జైల్లో ఉంటే తనకి అడ్డు ఉండదని స్కెచ్ వేసిన జగన్ ఎన్నికలు వెళ్లాలని భావిస్తున్నారని.. జగన్ అక్రమాల పై ప్రశ్నించిన వారిని జైలుకు పంపడం అలవాటుగా మార్చుకున్నారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. తన చేతిలో ఉన్న సీఐడీ ద్వారా జగన్ చంద్రబాబుపై కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబుతో సహా మాజీ మంత్రులందర్నీ జైలుకు పంపుతామని బహిరంగంగా వైసీపీ నేతలు చెప్పడం చూస్తుంటే అధికార మదం నెత్తికెక్కిందని అర్థం అవుతుందని సోమిరెడ్డి విమర్శించారు. ఏపీలో జగన్ బూటు కాలి కింద ప్రజాస్వామ్యం చచ్చింది.. గతంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో లిక్కర్ స్కాం ఏపీలో జరిగిందని సోమిరెడ్డి మండిపడ్డారు..
మేం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తే.. మాపై కేసులు పెడతారా?.. మరి జగన్ ట్రక్కుల్లో దోపిడీ సొమ్మును తరలించుకుని వెళ్తుంటే.. సీబీఐ, ఈడీలు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. అవినీతి పాలనను అంతం చేసే రోజులు దగ్గర పడ్డాయని.. ఏపీకి పట్టిన పీడ వదిలించు కోవాలంటే టీడీపీని గెలిపించండని సోమిరెడ్డి ఓటర్లను కోరారు..