అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections)వేళ బీఆర్ఎస్ (BRS)కి కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు టెన్షన్ పెడుతుంది. ప్రతిపక్షాలు ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందంటూ రచ్చరచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలో వరుసగా పిల్లర్ల కుంగుబాటు, లీకేజీల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతున్నది. అయినా భయపడని బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షాల విమర్శలకి గట్టిగానే సమాధానం చెబుతున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఇచ్చిన నివేదికలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని పేర్కొనడం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఎన్నికల వేళ పొలిటికల్‌గా తమకు కలిసి వస్తుందనుకున్న కాళేశ్వరం ఎలాంటి డ్యామేజ్ చేస్తుందో అనే ఆలోచన బీఆర్ఎస్ అభ్యర్థులకి టెన్షన్‌గా మారింది.
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ (Madigadda Barrage)పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడించింది. బ్యారేజ్ పునాది కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే పిల్లర్స్ సపోర్ట్ బలహీనపడిందని బాంబు పేల్చింది. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత సామర్థ్యం కూడా తక్కువగా ఉందని తెలిపింది. నాలుగు ప్రధాన కారణాల వల్ల పిల్లర్లు కుంగిపోయాయని ఈ నివేదికలో పేర్కొంది.
బ్యారేజ్ ప్లానింగ్ డిజైన్‌కు తేడా ఉందని.. వీటితో పాటు క్వాలిటీ, మెయింటెనెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేసింది. ప్రభుత్వం బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పరీక్షలు చేయలేదని భావిస్తున్నట్టు పేర్కొంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిక్స్ మెన్ కమిటీని నియమించింది. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కలిసి ఈ కమిటీ రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో మేడిగడ్డను పరిశీలించింది. అనంతరం ఢిల్లీకి వెళ్లి 43 పేజీలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
మరోవైపు రాష్ట్ర అధికారులు బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించలేదని పేర్కొన్న కమిటీ.. తాము 20 అంశాలపై వివరాలు కోరితే కేవలం 11 అంశాలపై మాత్రమే డేటా ఇచ్చారని.. అదికూడా అసంపూర్తిగా ఉందని తెలిపిది. ఈ నేపథ్యంలో బ్యారేజీ నిర్మాణంపై అనుమానాలు ఉన్నాయని కమిటీ పేర్కొంది. లోపాలను సరిదిద్దే వరకు బ్యారేజీలో నీటిని నింపవద్దని వెల్లడించింది. కాగా ప్రస్తుతం బ్యారేజ్‌లోని ఇతర బ్లాక్‌లు కూడా కుంగిపోయే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. అదే జరిగితే బ్యారేజ్ మొత్తాన్ని పునర్ నిర్మించాల్సి ఉంటుందని సిక్స్ మెన్ కమిటీ తెలిపింది.