నేషనల్ క్రష్ రష్మిక మందాన(Rashmika Mandanna) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. రష్మికకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఒక్క పోస్టుతో క్షణాల్లో లక్షల లైకులు వచ్చి పడుతుంటాయి. అయితే రష్మిక మార్ఫింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral) అయింది. నలుపు దుస్తుల్లో లిఫ్టులో వెళ్తున్న ఆ ఫేక్ వీడియోపై ఐటీ శాఖ సీరియస్ అయింది.
దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియోను ఓ జర్నలిస్ట్ పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోలో ఉన్నది జారా పటేల్ అనే యువతి అని.. రష్మిక కాదని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు చర్యలను అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మార్ఫింగ్ వీడియోల కట్టడి సామాజిక మాధ్యమాల బాధ్యతే అని ఐటీ శాఖ స్పష్టం చేసింది.
రష్మిక మార్ఫింగ్ వీడియో వివాదంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తాజాగా ట్విట్టర్ (x) వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ఇంటర్నెట్ వినియోగించే ప్రజల భద్రతకు కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన ఐటీ నిబంధల ప్రకారం.. సామాజిక మాధ్యమ వేదికలు కొన్ని చట్టపరమైన బాధ్యతలను పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
‘ప్రభుత్వ నిబంధనలను పాటించకపోతే రూల్-7 కింద.. ఆ సామాజిక మాధ్యమాలను కోర్టుకు లాగొచ్చు. మార్ఫింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన చర్య. ఈ సమస్యను సామాజిక మాధ్యమాలే పరిష్కరించాలి’ అని రాజీవ్ చంద్రశేఖర్ రాసుకొచ్చారు. ఈ వీడియోపై రష్మిక అభిమానులతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. ఈ ఘటనపై జర్నలిస్టు చేసిన ట్వీట్‌కు సంఘీభావం తెలుపుతూ రీ పోస్ట్ చేశారు.