సనాతన ధర్మం (Sanatana Dharma)పై మరోసారి తన వైఖరిని తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) సమర్థించుకున్నారు. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని చెప్పారు. ఆ వ్యాఖ్యల విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
తాను తప్పేమీ మాట్లాడలేదన్నారు. సనాతన ధర్మం గురించి తాను చేసిన వ్యాఖ్యలు సరైనవేనన్నారు. వాటిని న్యాయపరంగానే ఎదుర్కొంటానన్నారు. తన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోబోనన్నారు. తాను తన భావజాలం గురించి మాట్లాడానన్నారు. రాజ్యాంగ పిత బీఆర్ అంబేడ్కర్, పెరియార్, తిరుమావలవాన్ చెప్పిన మాటలనే తాను మాట్లాడానన్నారు.
తాను ఎమ్మెల్యేనని, ఒక మంత్రినని, యువజన విభాగం కార్యదర్శినన్నారు. రేపు ఆ పదవులు ఉండకపోవచ్చన్నారు. కానీ మనిషిగా ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. సనాతన ధర్మం గురించి తాము చాలా ఏండ్లుగా మాట్లాడుతున్నామన్నారు. సనాతన ధర్మం అనేది వందేండ్లకు పైబడిన అంశమన్నారు. దాన్ని తాము ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటామన్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఓ సభలో ఉదయ్ నిధి స్టాలిన్ మాట్లాడుతూ…. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆయన పిలుపు నిచ్చారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకమన్నారు. సనాతన ధర్మం డెంగీ, మలేరియా, దోమల లాంటిదన్నారు. వాటిని వ్యతిరేకించడం కాదనీ, వాటిని నిర్మూలించాలన్నారు.