అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (BJP) తమ అభ్యర్థుల నాలుగవ జాబితా(4th LIST) ను విడుదల చేసింది. ఈ జాబితాలో 12 మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. ఇప్పటికే మూడు దశల్లో 88 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
బీజేపీ తెలంగాణ నాలుగవ జాబితాలో చెన్నూరు బీజేపీ అభ్యర్థిగా దుర్గం అశోక్, ఎల్లారెడ్డి బీజేపీ అభ్యర్థిగా సుభాష్ రెడ్డి, కొడంగల్ అభ్యర్థిగా బంటు రమేష్ కుమార్, గద్వాల్ అభ్యర్థిగా బోయ శివ, మిర్యాలగూడెం అభ్యర్థిగా సాధినేని శ్రీనివాస్, హుస్నాబాద్ అభ్యర్థిగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సిద్దిపేట అభ్యర్థిగా దూది శ్రీకాంత్‌రెడ్డి, వికారాబాద్ అభ్యర్థిగా పెద్దింటి నవీన్ కుమార్, వేములవాడ బీజేపీ అభ్యర్థిగా తుల ఉమ, మునుగోడు అభ్యర్థిగా కృష్ణారెడ్డి, నకిరేకల్ అభ్యర్థిగా మొగులయ్య, ములుగు అభ్యర్థిగా అజ్మీరా ప్రహాద్నాయక్ పేర్లను ప్రకటించారు.
ఇప్పటికే గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌లు భారీ ర్యాలీతో నామినేషన్లను అధికారులకు సమర్పించారు. మంగళవారం ఈటల రాజేందర్ గజ్వేల్ నియోజకవర్గంలో నామినేషన్ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఇవాళ హైదరాబాద్‌లోని ఏర్పాటు చేస్తున్న బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోడీ విచ్చేయనుండడంతో ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగనున్న ప్రధాని ప్రసంగంలో పలు కీలక హామీలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
బీజేపీ ఇప్పటి వరకు మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 19 స్థానాలు పెండింగ్‌లో పెట్టింది. ఈ 19 స్థానాల్లో 12 బీజేపీకి.. మరో 7 స్థానాలు జనసేనకు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ పేర్లనూ అతి త్వరలోనే మిగిలిన అభ్యర్థుల ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు.. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల్లో బీజేపీ ప్రచారాలను ముమ్మరం చేసింది. బీ ఫారంలు అందుకున్న నేతలు నామినేషన్లు దాఖలు చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.