– విద్య, వైద్యం, ఉపాధి అందరికీ అందాలి
– జీవన్ రెడ్డి నర హంతకుడు
– కల్వకుంట్ల కుటుంబానికి దత్త పుత్రుడు
– బ్రిటీష్, రజాకార్లను కలిపితే ఎంత ఘోరంగా ఉంటుందో..
– అంతకంటే దారుణ పరిస్థితులు ఆర్మూర్ లో ఉన్నాయి
– నవంబర్ 30న కేసీఆర్ కు ప్రజలు సమాధానం చెబుతారు
– ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి రాకేశ్ రెడ్డితో..
– ‘రాష్ట్ర’ స్పెషల్ ఇంటర్వ్యూ
నిజామాబాద్ (Nizamabad) పార్లమెంట్ పరిధిలో ఉన్న ఆర్మూర్ వైపు తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. అక్కడ విజయం ఎవరి సొంతం అవుతుందో అనే ఆసక్తి నెలకొంది. అయితే.. బీజేపీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి (Rakesh Reddy) విజయం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన జీవితంలో ఓటమి అనే పదమే లేదని అంటున్నారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాకేశ్ రెడ్డిని పలకరించింది ‘రాష్ట్ర’ (Raashtra). ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలను ‘రాష్ట్ర’ తో పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక మెజారిటీతో గెలవబోయే తొలి సీటు ఆర్మూర్ అని తెలిపారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఒక నరహంతకుడు అని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అరాచకాలు, అవినీతి, హంతక ముఠాలను నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. బలహీనులపై కేసులు పెట్టి వేధిస్తూ ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారంటూ మండిపడ్డారు.
దళితులను టిప్పర్లు ఎక్కించి తలారీ సత్యం, చేకూరి రవిలు హత్యలు చేయిస్తున్నారని ఆరోపణలు చేశారు రాకేశ్ రెడ్డి. బ్రిటీష్ వాళ్లు, రజాకర్లు కలిపితే ఎంత ఘోరంగా ఉంటుందో.. అంతకన్నా దారుణంగా ఆర్మూర్ లో పరిస్థితులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని.. అందుకే ఆర్మూర్ పై ఆయనకు ప్రేమ లేదన్నారు. ఈ నియోజకవర్గంపై ఆయన పగ బట్టారని ఆరోపించారు. ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.
తాను స్థానిక బిడ్డనని చెప్పారు రాకేశ్ రెడ్డి. అన్ని సర్వేల్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబానికి తాము ఎందుకు భయపడాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు. తమకు తెలంగాణ అమరవీరులే స్ఫూర్తి అని స్పష్టం చేశారు. గతంలో దొరలను ఊళ్ల నుంచి ప్రజలు తరిమి వేశారని, ఇప్పుడు దొంగలు దొరల రూపంలో మళ్లీ వచ్చి మధ్య తరగతి బిడ్దలను నీళ్లు, నిధులు, నియామకల పేరుతో మోసం చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. జీవన్ రెడ్డి కేసీఆర్ కుటుంబానికి దత్త పుత్రుడు అంటూ ఫైర్ అయ్యారు.
చింత మడకలో ఇంటింటికి రూ.10 లక్షలను కేసీఆర్ ఎందుకు పంచుతారంటూ ప్రశ్నించారు రాకేశ్ రెడ్డి. ఉన్న నిధులన్నీ సిద్దిపేటకు తీసుకు వెళ్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ లోని 85 పల్లెల్లో కనీసం ఒక్క చోట కూడా డబుల్ బెడ్రూం కట్టించలేదన్నారు. యువతను గంజాయికి బానిసలుగా మారుస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ భృతి పేరిట మోసం చేశారని మండిపడ్డారు. ఈ అన్యాయాలపై ప్రశ్నిస్తే యువతపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ కు నవంబర్ 30న సమాధానం చెప్పేందుకు తెలంగాణ ప్రజలు రెడీగా వున్నారని అన్నారు ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి. తాను హైదరాబాద్ లో ఒక్క రూపాయికే వైద్యం చేస్తున్నానన్నారు. వందలాది మందికి విదేశీ విద్య విషయంలో సహకారం చేశానని వివరించారు. సుమారు 3 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నానని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి గురించి చెప్పడం కాదు తాను చేసి చూపించానన్నారు. తనకు అధికారం ఇస్తే ఆర్మూర్ ను మోడల్ ఆఫ్ తెలంగాణగా తీర్చి దిద్దుతానని స్పష్టం చేశారు రాకేశ్ రెడ్డి.