టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్(82) కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించిన ఆయన 1966లో రంగులరాట్నం సినిమాతో తెరంగేట్రం చేశారు.
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌రావు. అనేక సినిమాల్లో హీరోగా చేసిన ఆయన వరుసగా తండ్రి పాత్రల్లో అలరించారు. విలక్షణమైన నటనతో చంద్రమోహన్ ఇప్పటి వరకు 932 సినిమాల్లో నటించారు. చంద్రమోహన్ చాలా సినిమాల్లో స్టార్ హీరోయిన్ శ్రీదేవితో కలిసి నటించారు.
చంద్రమోహన్ తన కెరీర్లో చేసిన సినిమాలకు గానూ అనేక అవార్డులను కైవసం చేసుకున్నారు. రెండు ఫిలింఫేర్, ఆరు నంది అవార్డులను ఆయన అందుకున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పదహారేళ్ల వయసు’ సినిమాలో చంద్రమోహన్ అమాయకపు పాత్రలో ఆకట్టుకున్నారు.