తెలంగాణలో నేతల మాటలు ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నాయని అనుకుంటున్నాడు కామన్ మ్యాన్.. ఇన్నాళ్ళూ పాలించిన పాలకులు.. ఏం చేశారో.. ఇప్పుడున్న పాలకులు ఏంచేశారో.. ముందు ముందు ఏం చేస్తారో అంతా తెలుసంటున్న కామన్ మ్యాన్.. చెట్టు మీద కోతుల్లా అధికారం కోసం కొట్లాడుకొంటున్న నేతల తీరు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉందని అంటున్నాడు. కాకుల్లో ఉన్న ఐకమత్యం మనుషులలో లేకపోవడం బాధాకరమని కామన్ మ్యాన్ జాలిపడుతున్నాడు.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ (Congress) బీఆర్ఎస్ (BRS) ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారని జనం భావించేలా విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో ములుగు జిల్లా నాయకులు కొందరు హరీష్ రావు (Harish Rao)సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు..
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఐటీ రంగంలో నష్టపోతామని ఆరోపించారు. కర్ణాటకలో ఎటు చూసినా కరువు కనిపిస్తోందన్న హరీశ్‌రావు.. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడా అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకులు అవసరమన్న మంత్రి.. ఓటు వేసే ముందు ప్రజలు ఒకసారి ఆలోచించాలని అన్నారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కార్యకర్తలకు హరీశ్‌రావు దిశానిర్దశం చేశారు. మరోవైపు ములుగు (Mulugu) జిల్లా బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతిని గెలిపించాలని కార్యకర్తలను కోరారు. కాగా ఈ మధ్యకాలంలో చేసిన ఎన్నికల సర్వేల్లో బీఆర్ఎస్ గెలుస్తోందని హరీశ్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి ములుగులో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.