రాష్ట్రంలో నేతల భవిష్యత్ తేలడానికి ఇంకా మూడు వారాల సమయం ఉన్న నేపథ్యంలో.. ప్రచారంలో జోరు పెంచారు ఎన్నికల బరిలో అభ్యర్థులు.. ఈ క్రమంలో ఘాటు వ్యాఖ్యలతో విమర్శలకు దిగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉండగా.. తాజాగా కారు సర్కార్ పై మండిపడ్డారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan-Reddy)..
అంబర్ పేట (Amberpet) ప్రేమ్ నగర్ లో బీజేపీ (BJP) అభ్యర్థి కృష్ణ యాదవ్ తరపున కిషన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వానికి పేదల సమస్యల పట్ల చిత్తశుద్ది లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగులను, ఉద్యోగులను, బడుగు బలహీన వర్గాలను గత తొమ్మిది సంవత్సరాలుగా మోసం చేస్తున్న కేసీఆర్ (KCR)..ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు కానీ ఓట్లు కావాలని ప్రజల ముందుకు రావడం సిగ్గుచేటని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యిందన్న కిషన్ రెడ్డి.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సజావుగా ముందుకు పోవాలంటే మోడీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కార్.. ప్రగతిభవన్‌ను 4 నెలల్లో, సచివాలయాన్ని 8 నెలల్లో నిర్మించింది కానీ తొమ్మిది ఏళ్లు గడుస్తున్నా పేదల ఇల్లు మాత్రం ఇప్పటి వరకు అందివ్వలేకపోతుంది.. అసలు పేదలకు ఇచ్చే ఇళ్లపై కేసీఆర్‌కు చిత్తశుద్ది లేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గడిచిన ఐదేళ్లలో అంబర్ పేటలో చేసిన అభివృద్ధి ఏంటో.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తెలపాలని కిషన్ రెడ్డి అన్నారు. తాను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 21 స్కూళ్లు, ఒక బీసీ హాస్టల్, ఐదు సబ్ స్టేషన్లను ,100 నూతన కమ్యూనిటీ హాల్ లను నిర్మించానని కిషన్ రెడ్డి తెలిపారు. అంబర్ పేటలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టి, మూసీ నదిపై బ్రిడ్జి నిర్మించడమే కాకుండా వరదనీరు వస్తే ఇండ్లు ముంపుకు గురికాకుండా చర్యలు తీసుకున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు ఇక ఎప్పుడూ ఇళ్లు రావని ఆరోపించారు..