విరాట్ కోహ్లీ..టీమిండియా స్టార్ బ్యాటర్ . అతను పిచ్ లోఉంటే అవతలి బౌలర్ ఎంతటి వాడైనా, ఏ హిస్టరీ ఉన్నా, ఎలాంటి రికార్డులు ఉన్నా.. తల వంచాల్సిందే. ప్రత్యర్థులపై విరుచుకుపడి ఎన్నో సార్లు భారత్ సత్తా చాటిన పవర్ ఫుల్ ఆటగాడు.
అయితే విరాట్ రికార్డ్స్ లోనే కాదు సంపాదనలోనూ సరైనోడే అంటూ వస్తున్న వార్తలపై విరాట్ స్పందించాడు. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు విరాట్.
పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఫాలోవర్లను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడని పలు మీడియా సంస్థలు ప్రచారం చేశాయి.అంత వరకూ బాగానే ఉంది. ఆదాయాన్ని కూడా లెక్కలేసాయి. ఇవి కోహ్లీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడతాయనుకున్నాడో ఏంటో ఇప్పుడు ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చాడు.
సోషల్ మీడియా సంపాదనలో అందరి ఆటగాళ్లకన్నా ముందున్నాడని, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే …కోహ్లీ ఒక్కో పోస్టుకు వసూలు చేసే మొత్తం..కొందరు క్రికెటర్ల ఏడాది మొత్తం ఆదాయం కంటే ఎక్కువని రాసుకొచ్చాయి.
ఈ విషయాన్ని ‘హూపర్ హెచ్క్యూ(Huper HQ)’ అనే సంస్థ ఇటీవల విడుదల చేసిన జాబితాలో వెల్లడించిందంటూ రాసుకొచ్చాయి. తాజాగా ట్విట్టర్ ద్వారా తన సోషల్ మీడియా సైడ్ ఇన్ కమ్ పై కుండ బద్దలు కొట్టాడు..!
కోహ్లీ సంపాదనపై‘హ్యూపర్’ సంస్థ విడుదల చేసిన వివరాలు పరిశీలిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాలో అత్యధిక మొత్తం ఛార్జ్ చేసే తొలి 20 మంది పేర్లను ‘హూపర్ హెచ్క్యూ’ సంస్థ విడుదల చేసింది.
ఆ జాబితాలో కోహ్లీ 14 స్థానంలో ఉన్నాట. ఆ జాబితా ప్రకారం విరాట్..సింగిల్ స్పాన్సర్డ్ పోస్టుకు (virat kohli instagram post price) రూ.11 కోట్లు తీసుకుంటాడు. అతడికి 25.5 కోట్ల (Virat Kohli Instagram Followers) మంది ఫాలోవర్లు ఉన్నారని పేర్కొంది.
ఈ 20 మంది లిస్ట్లో ఇండియా నుంచి విరాట్ ఒక్కడే స్థానం దక్కించుకున్నాడని తెలిపింది.బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఈ జాబితాలో 29వ స్థానం దక్కించుకుందట. ఆమె ఒక ఇన్స్టా పోస్టుకు రూ.4.4 కోట్లు వసూలు చేస్తోందట.
‘హూపర్ హెచ్‌క్యూ’ సహ వ్యవస్థాపకుడు మైక్ బాండర్(Mike Bander)కూడా చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు.సూపర్ స్టార్లు ఇన్‌స్టా నుంచి ఆర్జిస్తున్న సంపాదన చూస్తే ఆశ్చర్యమేస్తోందని..వారి సంపాదన ఏళ్లు గడిచేకొద్దీ పెరుగుతోందని వెల్లడించాడు.
ఇన్స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌పై వీరి సంపాదన ఏటా పెరుగుతూనే ఉండటం చూసి తాను ఆశ్చర్యపోతున్నానని చెప్పాడు. ఇప్పుడు కోహ్లీ తన సంపాదనపై ఆ ప్రచారమంతా వట్టిదే అంటున్నాడు.