సుప్రీంకోర్టు(Supreme Court) సంచలన తీర్పు ఇచ్చింది. ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిల్లల ఆత్మహత్యలకు పాల్పడడానికి తల్లిదండ్రులే బాధ్యులని కోర్టు పేర్కొంది. దీంతో కోచింగ్ సెంటర్ల(Coaching Centre) నియంత్రణకు కోర్టు నిరాకరించింది.
చిన్నారుల ఆత్మహత్యలకు కోచింగ్ సెంటర్లే కారణమంటూ ముంబైకి చెందిన వైద్యుడు అనిరుధ్ నారాయణ్ మల్పానీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీంతో పాటు కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లలో కనీస ప్రమాణాలు పాటించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై చట్టం చేసేందుకు కోర్టు నిరాకరించింది.
కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు 24 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రుల కోరికలను పిల్లలపై రుద్దడం వల్లే వారు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి వారి సామర్థ్యాల కంటే ఎక్కువ ఆశిస్తారని, దీంతో పిల్లలు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపింది.
తప్పు పిల్లల తల్లిదండ్రులదే కానీ కోచింగ్ ఇనిస్టిట్యూట్‌ది కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. కోటాలో 14-16 సంవత్సరాల మధ్య వయసు ఉన్న విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఏడాది రాజస్థాన్‌లోని కోటాలో నీట్, జేఈఈ కోచింగ్‌ల కోసం వచ్చిన 24 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఖ్య గత 8 ఏళ్లలో అత్యధికం.