తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం (నవంబరు30)న జరగనుంది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. సీఎం కేసీఆర్(CM Kcr) ఒకటి, రెండు సభలతో ప్రచారాన్ని ప్రారంభించి ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఏకంగా రోజుకు నాలుగు, నుంచి ఐదు సభల్లో ప్రసంగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్(Parade Ground)లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ రద్దైంది.
రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వారం రోజులు ముందే షెడ్యూల్ను ఫిక్స్ చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఐదు రోజులే ఉండటంతో బీఆర్ఎస్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈ సభకు వర్షం అడ్డంకిగా మారింది. మూడురోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
దీంతో రేపు పరేడ్ గ్రౌండ్లో బీఆర్ఎస్ సభ రద్దు చేశారు. గురువారం నుంచి నగరంలో వర్షం పడుతుండటంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు ప్రచారానికి సమయం కొద్దిరోజులు ఉండటం.. మరోవైపు వర్షం కురుస్తుండటం ప్రచారానికి అంతరాయం కలిగింది. చలితో ప్రజలకు బయటకు రావడానికి జంకుతున్నారు.
ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి వర్షం అడ్డంకిగా మారడంతో పార్టీ శ్రేణుల్లో గుబులు నెలకొంది. సభ ఏర్పాటు చేస్తే జనం పెద్దసంఖ్యలో వస్తారా? అనేది ప్రశ్నగా మారింది. దీంతో బహిరంగ సభలకు ఈ రెండు, మూడు రోజులు నిర్వహించకపోవడమే మంచిదని పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, బీఆర్ఎస్ బహిరంగ సభలకు సంబంధించిన షెడ్యూల్లో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.