తెలంగాణ (Telangana)లో ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో.. పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వివిధ సర్వేల ద్వారా ఓటర్ల నాడీ తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వివిధ పార్టీల అవినీతికి సంబంధిత విషయాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్‌పై మంత్రి కేటీఆర్ (KTR)..బీఆర్ఎస్ (BRS)అభిమానులను, శ్రేణులను అప్రమత్తం చేశారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. ఓడిపోయే పార్టీలు పోలింగ్ సమీపిస్తోన్న సమయంలో డీప్‌ఫేక్‌లు (DeepFake) ఎక్కువగా ప్రచారంలోకి తెచ్చే అవకాశం ఉన్నట్టు కేటీఆర్ వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ (Congress)ను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ఓటమి అంచున ఉన్నదన్న కేటీఆర్.. ఆ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని.. డీప్‌ఫేక్‌లతో దుష్ప్రాచారం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉందని.. ఈ సమయంలో ఆ వార్తలను పట్టించుకోకుండా బీఆర్ఎస్ సైనికులు అప్రమత్తతో ఉండి ఓటర్లను చైతన్య పరచాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
మరోవైపు డీప్ ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగానికి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా స్ప్రెడ్ అవుతున్న విషయం తెలిసిందే.. దీనివల్ల సామాన్యులే కాకుండా.. ప్రముఖులు కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే హీరోయిన్లు రష్మికా మందన్నా, కాజోల్, కత్రినా కైఫ్‌లు ఈ అనుభవాన్ని చవిచూశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సైతం ఈ టెక్నాలజీతో ఇబ్బందులు తప్పలేదు..