ఎన్నికలకు ముందే రైతుబంధు(Rythu Bandhu) డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయాలని కాంగ్రెస్ మొత్తుకున్నా వినిపించుకోని బీఆర్ఎస్ నాయకులు ఇప్పడు అబద్ధాలు మాట్లాడడం సబబు కాదని పాలేరు(Paleru) కాంగ్రెస్ అభ్యర్థి (Congress Candidate) పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందాలనే కుట్రతోనే ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు.
ఖమ్మం రూరల్ మండలం కామంచికల్‌లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పొంగులేటి మాట్లాడారు. అక్టోబర్ 26నాడే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ విన్నపం ఇచ్చిందని గుర్తుచేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఇవ్వమని లేదా డిసెంబర్ ఒకటి తర్వాత ఇవ్వమని ఆనాడే కాంగ్రెస్ లెటర్ ఇచ్చిందని పొంగులేటి పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ నాయకులు వక్రీకరించి మాట్లాడుతున్నారని పొంగులేటి మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ చెప్పిన సమయానికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసేదన్నారు. చెప్పినప్పుడు ఇవ్వకపోవడమే కాకుండా తమపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ అసత్య ప్రచారాలను ప్రజలు, రైతులు గమనించాలన్నారు. ప్రజల దీవెనలతో డిసెంబర్ 11న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని జోస్యం చెప్పారు.
ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ అని పొంగులేటి స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుందని అన్నారు. ఇవన్నీ రావాలి, కావాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని వ్యాఖ్యానించారు. కొత్తగూడెంలో కూనంనేనిని గెలిపించడానికి తన శక్తినంతా దారపోస్తున్నానని తెలిపారు. కూనంనేని కొత్తగూడెంలో మంచి మెజార్టీతో గెలవబోతున్నారని అన్నారు.