యావత్ ప్రపంచాన్ని కోవిడ్ ఎంతలా కలవరపెట్టిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కోవిడ్ తర్వాత పలు రకాల వైరస్ (Virus)లు మనుషులను తరచుగా పలకరిస్తున్నాయి. అయితే తాజాగా బ్రిటన్‌లో తొలిసారిగా పందులలో కనిపించే వైరస్ మానవునిలో కనుగొనబడింది. లండన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) ఈ సమాచారాన్ని దృవీకరించింది. రొటీన్ చెకప్‌లో భాగంగా మనిషిలో స్వైన్ ఫ్లూ స్ట్రెయిన్ A(H1N2) కనుగొనబడిందని ఏజెన్సీ తెలిపింది.
బ్రిటన్ (Britain)లో ఒక వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. దీంతో అతన్ని పరీక్షించగా స్వైన్ ఫ్లూ స్ట్రెయిన్ H1N2 అని తేలిందని ఏజెన్సీ వివరించింది. అయితే ఈ వైరస్ పందులలో (pig virus) ఎక్కువగా కనిపిస్తుందని.. మనుషుల్లో కనిపించడం ఇదే తొలిసారని పరిశోధన చేస్తున్న వారు అంటున్నారు.. అయితే ఈ వైరస్ సోకిన వ్యక్తి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాకూడా వైద్యులు అతడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు.
ఈ వైరస్ పై స్పందించిన UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇన్సిడెంట్ డైరెక్టర్ డాక్టర్ మీరా చంద్.. ఒక వ్యక్తిలో ఈ వైరస్‌ను గుర్తించడం ఇదే మొదటిసారి అని తెలిపారు. సాధారణంగా పందులలో కనిపించే ఈ వైరస్ లక్షణాలు స్వైన్ ఫ్లూ మాదిరిగా ఉంటాయని వివరించారు. మరోవైపు 2009లో స్వైన్ ఫ్లూ మహమ్మారి లక్షలాది మందిని ఇబ్బందిపెట్టినట్టు మీరా చంద్ వెల్లడించారు.
ఇప్పటికే శాస్త్రవేత్తలు ప్రపంచానికి మరోసారి వైరస్ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు చైనాలో న్యుమోనియా వేగంగా విస్తరిస్తోంది. ఆసుపత్రుల్లో న్యుమోనియాతో బాధపడుతున్న రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇంత జరుగుతున్నా చైనా మాత్రం అధికారికంగా ఎలాంటి డేటాను విడుదల చేయడం లేదు.. మరోవైపు ఈ వైరస్ వ్యాప్తి విషయంలో భారతదేశం కూడా అప్రమత్తంగా ఉంది.