కరీంనగర్లో బీజేపీ ( BJP) నేత బండి సంజయ్ (Bandi Sanjay) అకృత్యాలతో ప్రజలు విసిగి వేసారి పోయారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎంపీ బండి సంజయ్‌ను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌కు నిరాశే మిగులుతుందన్నారు. బండి సంజయ్ బూటకపు మాటలను నమ్మే స్థితిలో కరీంనగర్ ప్రజలు లేరని అన్నారు.
బీఆర్ఎస్ మంచి మెజార్టీతో నాలుగోసారి విజయం సాధించబోతున్నామన్నారు. దక్షిణ భారత్‌లోనే తొలిసారిగా మూడవ సారి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి సారీ ధర్మం కోసం అని దేవుడి పేరు చెప్పే బండి సంజయ్ కనీసం ఒక్క గుడికి కూడా పైసా ఇవ్వలేదన్నారు. తాము వెంకటేశ్వర స్వామి, ఇస్కాన్ గుడి కడుతున్నప్పుడు బండి సంజయ్ సాయం ఏదన్నారు.
ఎంపీగా బండి సంజయ్ ఘోరంగా విఫలం అయ్యారని విమర్శించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోబపెట్టేందుకు డబ్బుల పంపిణీకి బండి వెళ్లారంటూ సీసీ టీవీ పుటేజ్ ను బయట పెట్టారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి బీజేపీ నేతలు డబ్బులు, మద్యం పంపిణీ చేశారన్నారు. కొత్తపల్లిలో బండి సంజయ్ అత్యంత దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు.
నిన్న కొత్తపల్లిలో డబ్బులు పంపిణీ చేస్తుంటే తమ వాళ్లు పట్టుకున్నారని చెప్పారు. డబ్బులు పంచుతూ బండి సంజయ్ అడ్డంగా దొరికిపోయాడన్నారు. మళ్లీ రివర్స్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలే డబ్బులు పంచుతున్నారంటూ ఘర్షణకు దిగాడన్నారు. బండి సంజయ్ డబ్బులు పంచారని సీసీ ఫుటేజీలో చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇంట్లో ఉన్న తమ కార్యకర్తపై స్వయంగా దాడులు చేశాడన్నారు. డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తున్న సంజయ్ మొదట పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని గంగుల ప్రశ్నించారు.
ఒక ఎంపీగా ఉండి ఇలా గుండాలను తీసుకు వెళ్లి దాడులు చేస్తావా అంటూ ఫైర్ అయ్యారు. ఇంట్లో ఉన్న కార్యకర్తను కొట్టి బూతులు తిడతావా? అని మండిపడ్డారు. ఇదేనా దేశం, కోసం ధర్మం కోసం పని చేయడమంటే అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ చూపెట్టిన ఓటర్ లిస్ట్ వారి కారులోనే దొరికిందన్నారు. తమ మీద బురద చల్లుతున్నారంటూ నిప్పులు చెరిగారు.