తెలంగాణ (Telangana) రాష్ట్రంలో బీజేపీ (BJP) అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అధికారం చేపట్టకపోయిన గత ఎన్నికల కంటే మెరుగైన స్థానాలను సాధించింది. అయితే రాష్ట్రంలో కమలం వికసించక పోవడానికి సవాలక్ష కారణాలను రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నేతలు కూడా పెదవి విప్పుతున్నారు..
ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ (EX MP) జితేందర్ రెడ్డి (Jitender Reddy) బీజేపీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ (Bandi Sanjay) అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. రాష్ట్రంలో కాషాయం అధికారం చేపట్టేదని అన్నారు. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని మార్చిన తర్వాత రాష్ట్ర బీజేపీలో మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ (BRS)కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అని మొదట భావించిన జనం.. బీజేపీ జోష్ తగ్గడంతో.. కాంగ్రెస్ వైపు మల్లారని తెలిపారు.
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన సాగించ లేదని.. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చతికిల పడిందని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదని తెలిపిన మాజీ ఎంపీ.. వారికి కేంద్ర ప్రభుత్వ అండ లేదని చెప్పారు. రేవంత్ రెడ్డి.. యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంచి పాలన అందించాలని కోరారు.
ఇక దేశంలో బీజేపీ పాలన మరో 30 ఏళ్లు ఉంటుందని.. దీనికి నిదర్శనం.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయమేనని జితేందర్ రెడ్డి వివరించారు. ప్రస్తుతం అధికారంలోకి రాకున్న.. వచ్చే ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలో బంఫర్ మెజారిటీతో గెలుస్తామని జితేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే తాను, తన కొడుకు మిథున్ మాత్రం మహబూబ్ నగర్ ప్రజల సేవలోనే ఉంటామని తెలిపారు.