బీఆర్ఎస్ (BRS) చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే భావన కొందరిలో కలుగుతుంది. ఇప్పటికే హస్తం అధికారంలోకి వస్తే.. సీఎం కుర్చీ కోసం పేచీలు జరుగుతాయని ప్రతి ప్రచారంలో బీఆర్ఎస్ నోటికి గంట కట్టుకుని మరీ మోగించింది. వారి ప్రచారాన్ని నిజం చేస్తూ.. కాంగ్రెస్ నేతల ప్రవర్తన ఉండటం రాష్ట్ర ప్రజలను, కాంగ్రెస్ కార్యకర్తలను ఆలోచనలో పడేసిందనే ముచ్చట వినిపిస్తుంది.
ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటే.. మరో ఐదు సంవత్సరాలు అధికారం కట్టపెడుతారనే ఆలోచన లేకుండా ఉన్న నేతల తీరుతో విసుగు చెందిన జనం బీఆర్ఎస్ రాగం అందుకోవడం ఖాయం అనే వాదన కూడా వినిపిస్తుంది. మరోవైపు హస్తం అధికారంలోకి వస్తే, పది మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని బీఆర్ఎస్ చేసుకున్న ప్రచారాన్ని నిజం చేస్తున్నారు హస్తం నేతలు..
ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడి ఇన్ని రోజులు గడుస్తున్నా సీఎం ఎవరనేది డిసైడ్ కాకపోవడం.. మరోవైపు రాష్ట్ర సీఎం పదవి రేసులో తాను కూడా ఉన్నట్లు కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) వెల్లడించారు. పార్టీ హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. సీఎం పదవిని ముగ్గురు.. నలుగురు ఆశించడంలో తప్పు ఏంటని ప్రశ్నించారు.
ప్రభుత్వ వ్యతిరేకత వల్ల పార్టీ అధికారంలోకి వచ్చిందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఢిల్లీ (Delhi)లోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ భేటీ అయ్యారు..