తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది.. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం పీఠం పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాగా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరవడానికి ఈ రోజు ఉదయం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ (Sonia Gandhi)..రాహుల్ గాంధీ (Rahul Gandhi)..ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.
ఈ క్రమంలో కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో సోనియా, రాహుల్, ప్రియాంకలకు.. రేవంత్, తెలంగాణ ఇన్చార్జ్ ఠాక్రే, శ్రీధర్ బాబు ఘన స్వాగతం పలికారు. భారీ భద్రత నడుమ కాన్వాయ్‌లో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాజ్‌కృష్ణ హోటల్‌కు ఏఐసీసీ నేతలు వెళ్లారు.
మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతల రాక సందర్భంగా ఎయిర్ పోర్ట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా తెలంగాణ సీఎంగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే.. ఇందుకోసం ఎల్బీస్టేడియం ముస్తాబైంది. ఇక ఈ కార్యక్రమంలో రేవంత్‌తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.