రేవంత్ రెడ్డి.. యువకుల గుండెల్లో కొలువై ఉన్న నేత.. అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నాయకుడు.. ఒక ఉప్పెనలా వచ్చి.. ప్రభంజనాన్ని సృష్టించారు అని కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు సంబరపడుతున్నారు. కాగా నేడు తెలంగాణ (Telangana) సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. తన తొలి ప్రసంగం ప్రజలను ఆకట్టుకునేలా ప్రారంభించారు.. తెలంగాణ ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రమని తెలిపిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ మొత్తం అభివృద్ది చెందుతుందని వెల్లడించారు.
ప్రజలు పదేళ్ళుగా బాధలను మౌనంగా భరించారు.. అందుకే ప్రగతిభవన్ (Pragati Bhavan) చుట్ట ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించానని రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. గత ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోలేదు కానీ ఈ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములని రేవంత్ అన్నారు. ప్రజాభవన్ లో ప్రజా పరిపాలన అందిస్తాం..ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావొచ్చుని తెలిపారు రేవంత్ రెడ్డి..
కాంగ్రెస్ సమిధగా మారి తెలంగాణ ఇస్తే.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించిన రేవంత్ రెడ్డి.. అమరవీరుల ఆకాంక్షలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల (Six Guarantees) ఫైలు పై తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలైన రజిని ఉద్యోగ నియామక ఫైల్ పై రెండో సంతకం చేశారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాన్ని ఆమెకు అందచేశారు.
అలాగే జ్యోతిరావు పూలే ప్రజా భవన్(ప్రగతి భవన్)లో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి.. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. కాగా రేవంత్ రెడ్డి సీఎం గా అధికార పీఠాన్ని చేపట్టిన సందర్భంలో పలువురు ప్రముఖులతో పాటుగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా అభినందనలు తెలిపారు.