తెలంగాణ (Telangana) అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ఎల్‌పీ నేతగా (BRSLP leader) కేసీఆర్‌ను ఎన్నుకున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం ఉదయం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు కె.కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. బీఆర్‌ఎస్ (BRS) పార్టీ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఉండాలని ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యేలు బలపరిచారు.
మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారం చేపట్టి సీఎల్పీ నేతగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో ఎల్పీ నేత ఎవరు అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. కేసీఆర్‌నే ఎన్నుకోవడంతో నేటితో శాసనసభా పక్ష నేత ఎవరనే ఉత్కంఠకు శుభం కార్డు పడింది. అయితే, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉంటారా? ఉండరా? అనే ప్రశ్న కూడా పార్టీ వర్గాలలో ఉత్పన్నమవుతోంది.
ఇప్పటికే రేవంత్‌కు, కేసీఆర్‌కు మధ్య వైరం ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో కూడా ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది.. ఈ తరుణంలో కేసీఆర్ విపక్ష నేతగా వ్యవహరిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.. మరోవైపు తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ మొదటి సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి.