తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ (Protem Speaker)అక్బరుద్ధీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం చేయించారు. మొదటగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తరువాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం.. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమం తరువాత స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నారు.
మరోవైపు ఈ రోజు జరగనున్న అసెంబ్లీ సమావేశాలను బీజేపీ ఎమ్మెల్యేలు బాయ్‌కాట్ చేశారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ (Akbaruddin)ను ప్రొటెం స్పీకర్ గా నియమించడం పట్ల తెలంగాణ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీలో జరిగే ప్రమాణస్వీకారాన్ని బహిష్కరిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న ప్రమాణ స్వీకారం సభకు 109 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా తొలిసారి అసెంబ్లీలో అన్ని పార్టీల తరఫున 51 మంది ఎమ్మెల్యేలు అడుగుపెట్టారు.. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారికి శాఖల కేటాయింపు జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం మంత్రుల శాఖలకు ఆమోదముద్ర వేసింది. ఇదే అంశంపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అధిష్టానంతో చర్చలు జరిపిన అనంతరం శాఖల కేటాయింపు జరిగింది.